Share News

పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లకు ఆర్థిక కష్టాలు.. రోజువారీ అలవెన్సుల్లో భారీ కోత

ABN , Publish Date - May 22 , 2026 | 04:22 PM

పాకిస్థాన్ హాకీ జట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తోన్న వేళ.. పాక్ హాకీ ప్లేయర్లకు మరో షాక్ తగిలింది. హాకీ ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో శిక్షణ శిబిరం రోజువారీ భత్యాన్ని భారీగా తగ్గించడం వివాదాస్పదంగా మారింది.

పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లకు ఆర్థిక కష్టాలు.. రోజువారీ అలవెన్సుల్లో భారీ కోత
Pakistan hockey team

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ హాకీ జట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్.. ప్లేయర్లకు నిధులు సమకూర్చకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తోన్న వేళ.. పాక్ హాకీ ప్లేయర్లకు మరో షాక్ తగిలింది. హాకీ ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో శిక్షణ శిబిరం రోజువారీ భత్యాన్ని భారీగా తగ్గించడం వివాదాస్పదంగా మారింది.


పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్(పీహెచ్ఎఫ్) ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లకు ఇచ్చే రోజువారీ భత్యాన్ని 3000 పాకిస్థాన్ రూపాయిల నుంచి 1000 పాకిస్థాన్ రూపాయిలకు తగ్గించింది. భారత కరెన్సీలో 1000 పాకిస్థాన్ రూపాయిల విలువ రూ.335 మాత్రమే. ఈ నిర్ణయంపై ప్లేయర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు ఘోర అవమానంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ పర్యటన సమయంలో పాక్ ప్లేయర్లకు, సిబ్బందికి రోజుకు 110 డాలర్లు చెల్లిస్తామని పీహెచ్ఎఫ్ ప్రకటించింది. అయితే గతంలో ఇచ్చిన హామీలే అమలు కాలేదని, తమకు రావాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయంటూ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు నిజంగా ఇస్తారో? లేదో? తెలియదు. మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే పాక్ హాకీ ఫెడరేషన్‌ను నమ్ముతాం’ అని ఓ ప్లేయర్లు పేర్కొన్నట్లు సమాచారం.


ఇదిలా ఉంటే, ఆగస్టు 15 నుంచి హాకీ ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీంట్లో భాగంగా జూన్ 13 నుంచి 27 వరకు హాకీ ప్రో లీగ్ పోటీలు జరగనున్నాయి. ఇందులో పాకిస్థాన్.. బెల్జియం, స్పెయిన్, ఇంగ్లండ్, భారత్‌తో తలపడనుంది. అనంతరం ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొననుంది. అయితే దేశానికి ట్రోఫీని అందించేందుకు శ్రమించాల్సిన ప్లేయర్లు.. ఆర్థిక ఇబ్బందులపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇవి కూడా చదవండి:

మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం: స్టువర్ట్ బ్రాడ్

ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా

Updated Date - May 22 , 2026 | 04:26 PM