Share News

ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. రాబిన్సన్ బౌలింగ్‌లో వైభవ్ నిలబడగలడా?

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:42 PM

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఓల్ రాబిన్సన్ అదిరే రీఎంట్రీ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు తెరపైకి వచ్చింది.

ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. రాబిన్సన్ బౌలింగ్‌లో వైభవ్ నిలబడగలడా?
Ollie Robinson

ఇంటర్నెట్ డెస్క్: లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఓలీ రాబిన్సన్ అదిరే రీఎంట్రీ ఇచ్చాడు. అద్భుత ప్రదర్శనతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. గురువారం ప్రారంభమైన టెస్టు మ్యాచ్ తొలి రోజునే రాబిన్సన్ వేసిన తొలి ఓవర్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకే ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు తెరపైకి వచ్చింది. రాబిన్సన్ బౌలింగ్‌లో వైభవ్ నిలబడగలడా? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.


వర్షం కారణంగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్ కాసేపు ఆగింది. స్వింగ్‌కు అనుకూలించే లార్డ్స్ పిచ్‌ను పూర్తిగా వినియోగించుకున్న రాబిన్సన్.. వేసిన తొలి ఓవర్‌లోనే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లను కుదేలు చేశాడు. తొలి రెండు బంతులు డాట్స్, మూడో బంతికి డేవాన్ కాన్వే ఔట్, నాలుగో బంతి డాట్, ఐదో బంతికి కేన్ విలియమ్సన్ ఔట్, ఆరో బంతికి రచిన్ రవీంద్రను పెవిలియన్‌కు పంపి.. న్యూజిలాండ్‌కు గట్టి షాకిచ్చాడు. మూడు వికెట్లు, మెయిడెన్ ఓవర్‌తో ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని అందించాడు.


రాబిన్సన్ రీఎంట్రీలో వేసిన తొలి ఓవర్‌లోనే విధ్వంసం సృష్టించడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌ను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొని ఉండేవాడా? అంటూ చర్చ మొదలైంది. ‘వైభవ్ ఇలాంటి పరిస్థితుల్లో నిలబడటం కష్టమే’ అని కొందరు అభిమానులు అభిప్రాయపడగా.. మరికొందరు ‘అతడు ఇంకా భారత జట్టుకు ఆడలేదు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడతాడో అంచనా వేయడం సరికాదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఐపీఎల్‌లో ప్రపంచ మేటి బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్‌కు ఇదేమీ పెద్ద విషయం కాదు’ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 03:42 PM