Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీ పోవడానికి కారణం అతనే.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Jan 16 , 2026 | 04:53 PM
భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఉన్నాడంటూ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ తొలగింపు వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించినప్పటికీ.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు నిజమేనంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. 'రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి ప్రాథమిక కారణం ఏమిటో నాకు తెలియదు. అయితే.. నాకు తెలిసినంత వరకు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)కు బలమైన వ్యక్తిత్వం ఉంది. అతను కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడని వ్యక్తి. అలానే ఆయన విధనాలూ నిర్ణయాత్మకంగా ఉంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు తెర వెనుక చాలా విషయాలు జరుగుతాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం విషయంలో హెచ్ కోచ్ గంభీర్(Gautam Gambhir) ఇన్‌పుట్స్ కచ్చితంగా ఉండి ఉంటాయి. కెప్టెన్సీ మార్పును చీఫ్ సెలెక్టర్ ప్రకటించినప్పటికీ.. కోచ్ ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు.
ఒకరి భుజంపై తుపాకీ పెట్టి.. మరొకరు కాల్చినట్లుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ను మార్చడం వెనుక క్రికెట్ లాజిక్ ఏముందో నాకు అర్థం కావడం లేదు. మూడుసార్లు డబుల్ సెంచరీలు బాదిన, జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఆటగాడి సామర్థ్యాన్ని శంకించడం తప్పు. బీసీసీఐ నిర్ణయం నాకు చాలా బాధ కలిగించింది' అని మనోజ్ తివారీ(Manoj Tiwary) వ్యాఖ్యానించారు. మేనేజ్‌మెంట్ తీసుకునే ఇలాంటి నిర్ణయాల కారణంగా తనకు వన్డేలు చూడాలనే ఆసక్తి కూడా తగ్గిపోయిందని తివారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. మరో హ్యాట్రిక్ నమోదు