నేడు భారత్, పాక్ పోరు.. మరోసారి తెరపైకి 'కరచాలనం'
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:26 AM
క్రీడతో సంబంధం లేకుండా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే చాలు.. చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తారు. నేడు ఈ దాయాదీ దేశాల మధ్య మరో కీలక పోరు జరగనుంది.
స్పోర్ట్స్ డెస్క్: క్రీడ ఏదైనా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే ఆ క్రేజ్ వేరే ఉంటాది. ఎలాంటి టోర్నీ అయినా సరే.. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ప్రత్యేకమైన బజ్ ఉంటుంది. ఈ దాయాదీల ఆటకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి లేదు. అలాంటి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య నేడు పోరు జరగనుంది. హాకీ ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(బుధవారం) ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కరచాలనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఉగ్రవాదాన్ని పెంచుతుందంటూ పాకిస్థాన్ తీరుపై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీంతో వారితో క్రీడల్లో ద్వైపాక్షికంగా ఎలాంటి సంబంధాలు లేవు. అంతర్జాతీయ వేదికలపై మినహా.. మరెక్కడా పాల్గొనడం లేదు. గతేడాది ఏప్రిల్ లో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇంటర్నేషనల్ వేదికలపై పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా భారత క్రీడాకారులు నిరాకరిస్తున్నారు. ఇదే సూత్రాన్ని క్రికెట్‌కు మాత్రమే కాకుండా.. హాకీ విషయంలోనూ పాటించేందుకు భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. తమకు కరచాలనం కంటే మ్యాచ్‌లో విజయం సాధించడమే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ తప్పనిసరిగా గెలవాలి. ఇదే సమయంలో భారత్ మ్యాచ్ గెలవకున్నా.. కనీసం డ్రా చేసుకున్నా సరిపోతుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై గెలిచింది. అలానే రెండో పోరులో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 6, భారత్ 3, వేల్స్, పాకిస్థాన్ చెరొక పాయింట్‌తో ఉన్నాయి. టాప్ -2లో ఉండే జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.