Share News

‘కూత’వేటు దూరంలో..

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:39 AM

భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు థాయ్‌లాండ్, నేపాల్‌పై ఘన విజయాలతో ఆసియా క్రీడల ఫైనల్స్‌కు చేరాయి. బ్యాడ్మింటన్‌లో సాత్విక్–చిరాగ్‌కు షాక్ తగలగా, స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖరారయ్యాయి; హాకీలో భారత మహిళలు సెమీఫైనల్‌కు చేరువయ్యారు.

‘కూత’వేటు దూరంలో..
Asian Games India

ఫైనల్లో భారత కబడ్డీ జట్లు

నగోయా: ఆసియా క్రీడల కబడ్డీలో భారత్‌ ఆధిపత్యం కొనసాగిస్తోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత పురుషులు, మహిళల జట్లు టైటిళ్లు నిలబెట్టుకునేందుకు ‘కూత’వేటు దూరంలో నిలుస్తూ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. పురుషుల సెమీఫైనల్లో భారత్‌ 66-28తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసి స్వర్ణ పోరుకు చేరుకుంది. మహిళల సెమీ్‌సలో భారత్‌ 48-24తో నేపాల్‌పై గెలుపొందింది. టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా టైటిల్‌ పోరుకు చేరిన భారత జట్లకు కనీసం రజత పతకాలు దక్కనున్నాయి. శనివారం జరిగే పసిడి పోరులో ఇరాన్‌ జట్లతో భారత పురుషులు, మహిళల బృందాలు అమీతుమీ తేల్చుకుంటాయి.


బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ జోడీకి షాక్‌

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, భారత నెంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టికి అనూహ్య పరాజయం ఎదురైంది. స్వర్ణమే లక్ష్యం గా బరిలోకి దిగిన ఈ భారత ద్వయం ఆరంభ రౌండ్లోనే వెనుదిరిగింది. నా లుగో సీడ్‌ సాత్విక్‌ జంట 21-12, 19-21, 14-21తో థాయ్‌లాండ్‌ ద్వయం పకపోన్‌ తీరారత్సాకుల్‌/పీరాచయ్‌ సుక్‌ఫాన్‌ చేతిలో ఓటమిపాలై ఈసారి పతకం లేకుండానే వెనుదిరిగింది.


ఇక, మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ ద్వయం 21-16, 16-21, 21-16తో హాంకాంగ్‌ జోడీ హూయి యాన్‌/లోక్‌ లూయిపై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జంట ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో వరుసగా రెండు విజయాలతో క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. ఆరంభ పోరులో 21-8, 21-7తో నిబల అహ్మద్‌/అమినాత్‌ నబీహ (మాల్దీవులు) జంటను ఓడించిన ధ్రువ్‌ జంట.. ప్రీక్వార్టర్స్‌లో మలేసియా జోడీ షెవాన్‌ జేమీ లాయ్‌/సూన్‌ హువాత్‌పై 22-20, 24-22తో గెలిచింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఉన్నతి హుడా 21-9, 21-10తో మి సోంగ్‌ (కొరియా)పై నెగ్గింది.


బాక్సింగ్‌లో క్వార్టర్స్‌కు సచిన్‌

బాక్సింగ్‌లో మనోళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల్లో సచిన్‌ సివాచ్‌ క్వార్టర్స్‌ చేరగా.. మహిళల్లో గత క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్‌ ఇంటిబాట పట్టింది. 60 కిలోల విభాగం ప్రీక్వార్టర్స్‌లో సచిన్‌ 4-1తో మహ్మద్‌ అద్నాన్‌ (జోర్డాన్‌)ను మట్టికరిపించగా.. 54 కిలోల ప్రీక్వార్టర్స్‌లో ప్రీతి 0-5తో పాంగ్‌ చోయి (కొరియా) చేతిలో పరాజయం పాలైంది.


ఫెన్సింగ్‌లో ఆశలు ఆవిరి

ఫెన్సింగ్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. పురుషుల ఫాయిల్‌, మహిళల ఎపీ టీమ్‌ ఈవెంట్లలో భారత జట్లు ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాయి. హాంకాంగ్‌ చేతిలో 27-45తో పురుషులు, ఉజ్బెకిస్థాన్‌ చేతిలో 29-45తో మహిళలు ఓటమి పాలయ్యారు.

స్విమ్మింగ్‌లోనూ నిరాశే

భారత స్విమ్మర్లు తమ విభాగాల్లో ఫైనల్స్‌కు చేరినా పతకాలు మాత్రం నెగ్గలేకపోయారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఫైనల్లో సాజన్‌ ప్రకాశ్‌ ఏడో స్థానంలో నిలవగా.. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో రిషభ్‌ దాస్‌, ఉత్కర్ష్‌ పాటిల్‌ వరుసగా ఆరు, ఏడు స్థానాలకు పరిమితమై నిరాశపరిచారు.


స్క్వాష్‌లో మూడు పతకాలు ఖరారు

ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత క్రీడాకారులు మూడు విభాగాల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం మూడు పతకాలు ఖాయం చేశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో జోష్న చినప్ప/సెంథిల్‌ కుమార్‌ 11-3, 11-5తో ఫిలిప్పీన్స్‌ జంట జేమికా/డేవిడ్‌ను చిత్తుచేయగా.. మహిళల సింగిల్స్‌లో టీనేజ్‌ సంచలనం అనహత్‌ సింగ్‌ 11-2, 11-5, 11-3తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాను, పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌ 11-4, 11-3, 11-6తో స్థానిక ఫేవరెట్‌ యోనోసుకెను ఓడించారు. ఇక, స్క్వాష్‌ సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన క్రీడాకారులు నేరుగా 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించనున్నారు.


హాకీలో అదే జోరు.. సెమీ‌స్‌కు అమ్మాయిలు!

హాకీలో భారత అమ్మాయిలు వరుసగా నాలుగో విజయంతో టోర్నీలో అజేయంగా నిలిచారు. పూల్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత్‌ 3-1తో ఆతిథ్య జపాన్‌ను ఓడించి దాదాపు సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత జట్టులో లాల్‌రెమ్సియాని (5వ), ఇషికా చౌధురి (30వ), నవ్‌నీత్‌ కౌర్‌ (36వ) తలో గోల్‌ చేశారు. జపాన్‌ తరఫున ఏకైక గోల్‌ను షిహో (46వ) కొట్టింది. వరుస విజయాలతో ఇప్పటికే గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన భారత అమ్మాయిలు ఆఖరి పూల్‌ మ్యాచ్‌ను ఆదివారం సింగపూర్‌తో తలపడనున్నారు. ఇక, పురుషుల గ్రూప్‌-ఎలో భారత జట్టు తమ నాలుగో మ్యాచ్‌ను శనివారం జపాన్‌తో ఆడనుంది.


ఈ వార్తలనూ చదవండి:

వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..

అప్పుడు మల్లి.. ఇప్పుడు మీరా!

Updated Date - Sep 26 , 2026 | 01:45 AM