Share News

ఫిలిప్స్ సూపర్‌మ్యాన్ క్యాచ్.. తానే నమ్మలేకపోయాడు! వీడియో వైరల్

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:22 PM

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు.

ఫిలిప్స్ సూపర్‌మ్యాన్ క్యాచ్.. తానే నమ్మలేకపోయాడు! వీడియో వైరల్
Glenn Phillips

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు.


గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ ముగిసేసరికి స్కోరు 17/0. ఈ సమయంలో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బౌండరీ లైన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి ఎగిరి కేవలం ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అది అంత సులభమైన క్యాచ్ కాదు. బౌండరీ లైన్‌ను తాకకుండా అద్భుతమైన టైమింగ్‌తో బంతిని ఒంటి చేత్తో అందుకున్న ఫిలిప్స్.. వెంటనే తన చేతిని, క్యాచ్‌ను చూసుకుని తానే నమ్మలేనట్లుగా స్పందించాడు.


‘సూపర్‌మ్యాన్’ ఫిలిప్స్!

ఫిలిప్స్‌కు ఇలాంటి అద్భుత క్యాచ్‌లు కొత్తేమీ కాదు. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లను కూడా అతడు సునాయాసంగా అందుకుంటుంటాడు. అందుకే అభిమానులు, కామెంటేటర్లు అతడిని ముద్దుగా ‘సూపర్‌మ్యాన్’ అని పిలుస్తుంటారు. CPLలో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్.. రనౌట్లు, స్టంపింగ్‌లలోనూ తన ముద్ర వేశాడు.


ఇవి కూడా చదవండి:

క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్

అఫ్గాన్ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్య!

Updated Date - Sep 01 , 2026 | 01:23 PM