Share News

రెండోసారీ రిటైర్మెంట్.. జర్మనీ గోల్‌కీపర్ నోయర్ సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Jul 01 , 2026 | 08:24 AM

జర్మనీ స్టార్ గోల్‌కీపర్ మనువెల్ నోయర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్‌2026లో జర్మనీ జట్టు ఊహించని రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో 40 ఏళ్ల నోయర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

రెండోసారీ రిటైర్మెంట్.. జర్మనీ గోల్‌కీపర్ నోయర్ సంచలన నిర్ణయం..
Manuel Neuer

స్పోర్ట్స్ డెస్క్: జర్మనీ స్టార్ గోల్‌కీపర్ మనువెల్ నోయర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్‌లో జర్మనీ జట్టు ఊహించని రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో 40 ఏళ్ల నోయర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో జర్మనీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయం తర్వాత మీడియాతో మాట్లాడిన నోయర్.. అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తన చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు. 'ఇలాంటి చేదు జ్ఞాపకంతో కెరీర్‌ను ముగించాల్సి రావడం చాలా బాధగా ఉంది' అని ఆవేదన వ్యక్తం చేశాడు.


నోయర్ 2024 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అనంతరం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్లీ జట్టులోకి వచ్చే ప్రసక్తే లేదని అప్పట్లో తేల్చి చెప్పాడు. అయితే, బార్సిలోనా కీపర్ మార్క్-ఆండ్రీ టెర్ స్టెగెన్ గాయపడటంతో.. జర్మనీ కోచ్ జూలియన్ నాగెల్స్‌మన్ విజ్ఞప్తి మేరకు నోయర్ ప్రపంచకప్2026 కోసం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. నోయర్ పునరాగమనం వరకు ఒలివర్ బౌమాన్ జర్మనీ నంబర్-1 కీపర్‌గా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ నాగెల్స్‌మన్ ప్రపంచకప్‌లో నోయర్‌కే అగ్రతాంబూలం ఇచ్చాడు.


కానీ, కోచ్ నమ్మకాన్ని నోయర్ నిలబెట్టుకోలేకపోయాడు. పరాగ్వేతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో నోయర్ ఒక పెనాల్టీని అడ్డుకున్నప్పటికీ జర్మనీ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలమవడంతో జర్మనీ 3-4 తేడాతో పరాజయం పాలైంది. 2009లో జర్మనీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నోయర్.. మొత్తం 128 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో ప్రపంచకప్ సాధించిన జర్మనీ జట్టులో ప్రస్తుతం ఆడుతున్న ఏకైక ఆటగాడు నోయర్ కావడం విశేషం. అతడు రిటైర్మెంట్‌తో జర్మనీ ఫుట్‌బాల్‌లో ఒక సుదీర్ఘమైన, గొప్ప శకం ముగిసిందని క్రీడా నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026.. స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం
జర్మనీ ‘సడన్‌ డెత్‌’

Updated Date - Jul 01 , 2026 | 08:24 AM