Share News

జర్మనీ ‘సడన్‌ డెత్‌’

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:52 AM

ఫిఫా వరల్డ్‌క్‌పలో పెను సంచలనం చోటు చేసుకొంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌ జర్మనీకి షాకిస్తూ.. అండర్‌ డాగ్‌ పరాగ్వే ప్రీక్వార్టర్స్‌ బెర్త్‌ను పట్టేసింది. సడన్‌డెత్‌లో...

జర్మనీ ‘సడన్‌ డెత్‌’

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

మెక్సికో X ఈక్వెడార్‌

(ఉదయం 6.30)

ఇంగ్లండ్‌ X డీఆర్‌ కాంగో

(రాత్రి 9.30)

బెల్జియం X సెనెగల్‌

(అర్ధరాత్రి 1.30)

  • షూటౌట్‌లో పరాగ్వే సంచలనం

  • జట్టును ప్రీక్వార్టర్స్‌కు చేర్చిన కనాలే

ఫాక్స్‌బరో: ఫిఫా వరల్డ్‌క్‌పలో పెను సంచలనం చోటు చేసుకొంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌ జర్మనీకి షాకిస్తూ.. అండర్‌ డాగ్‌ పరాగ్వే ప్రీక్వార్టర్స్‌ బెర్త్‌ను పట్టేసింది. సడన్‌డెత్‌లో జర్మన్‌ ప్లేయర్‌ జొనాథన్‌ థా పెనాల్టీ కిక్‌ను బయటకు కొట్టగా.. పరాగ్వే డిఫెండర్‌ జోష్‌ కనాలే గోల్‌గా మలిచాడు. దీంతో మంగళవారం జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌ షూటౌట్‌లో 34వ ర్యాంకర్‌ పరాగ్వే 4-3తో 12వ ర్యాంకర్‌ జర్మనీకి షాకిచ్చింది. అదనపు సమయం వరకు సాగిన మ్యాచ్‌లో ఇరుజట్లూ 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. పరాగ్వే ఆటగాడు జూలియో ఎన్‌సిసో (42వ నిమిషం) గోల్‌ చేయగా.. జర్మనీ తరఫున కై హవెర్ట్‌జ్‌ (54వ) గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు.

కనాలే కూల్‌గా..: పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ ప్లేయర్లు హవెర్ట్‌జ్‌, నిక్‌ వోల్డ్‌మేడ్‌ కిక్‌లు మిస్‌ కాగా.. పరాగ్వే ప్లేయర్లు ఆంటోనియో సనాబ్రియా, ఫాబియాన్‌ గోల్‌ చేయలేక పోయారు. దీంతో షూటౌట్‌లో స్కోరు 3-3తో సమం కావడంతో.. ఫలితం సడన్‌డెత్‌కు మళ్లింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జొనాథన్‌ బయటకు కొట్టగా.. కనాలే కూల్‌గా బంతిని గోల్‌లోకి పంపి.. పరాగ్వేను ప్రీక్వార్టర్స్‌కు చేర్చాడు.


ప్రీక్వార్టర్స్‌లో నార్వే

ఎర్లింగ్‌ హాలాండ్‌ లేటు గోల్‌తో.. నార్వే 2-1తో ఐవరీకోస్ట్‌పై గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. రౌండ్‌-16లో బ్రెజిల్‌తో తలపడనుంది. నార్వే తరఫున ఆంటోనియో నూసా (39వ నిమిషం), హాలాండ్‌ (86వ) గోల్స్‌ చేయగా.. ఐవరీ ఆటగాడు అమండ్‌ డయల్లో (74వ) ఏకైక గోల్‌ సాధించాడు. 1-1తో సమమైన తరుణంలో మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీసేలా కనిపించింది. కానీ, 86వ నిమిషంలో ప్యాట్రిక్‌ ఇచ్చిన పాస్‌ను హాలాండ్‌ గోల్‌లోకి పంపడంతో నార్వే సంబరంలో మునిగింది.

నెదర్లాండ్స్‌కు మొరాకో ఝలక్‌

గ్వాదలూపే (మెక్సికో): ఇస్మాయిల్‌ సైబరి ఆఖరి కిక్‌ను గోల్‌గా మలచడంతో.. నెదర్లాండ్స్‌ను మొరాకో షూటౌట్‌ చేసింది. రౌండ్‌-32 మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో నెదర్లాండ్స్‌పై గెలిచిన మొరాకో.. ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. 72వ నిమిషంలో డచ్‌ ఆటగాడు కోడీ హక్పో గోల్‌ చేయగా.. స్టాపేజ్‌ టైంలో మొరాకో తరఫున ఇస్సా డయోప్‌ (90+1వ) సమం చేశాడు. దీంతో నిర్ణీత సమయంకల్లా ఇరుజట్లూ 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత అదనపు సమయంలో కూడా గోల్‌ చేయడంలో విఫలం కావడంతో.. షూటౌట్‌ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్‌లో ఇరుజట్లూ 2-2తో సమంగా నిలిచాయి. అయితే, సుమ్మరివిల్లే తీసుకొన్న ఐదో కిక్‌ను మొరాకో కీపర్‌ యాసిన్‌ సూపర్‌గా అడ్డుకొన్నాడు. ఆ తర్వాత సైబరి గోల్‌ చేసి మొరాకోకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

5-Sports.jpg

దుఃఖాన్ని దిగమింగి..

డచ్‌ ప్లేయర్‌ హక్పో తీవ్ర విషాదంలో ఉండి కూడా జట్టు తరఫున బరిలోకి దిగాడు. గోల్‌ చేసిన అతడు సంబరాలు చేసుకోకుండా.. భావోద్వేగానికి గురయ్యాడు. మోకాళ్లపై వంగి కన్నీళ్లు పెట్టుకోవడంతో.. సహచరులు అతడిని ఓదార్చారు. ఈ మ్యాచ్‌కు మూడు రోజుల ముందే హక్పో భాగస్వామి నోవా వాన్‌ డెర్‌ బిజ్‌ ఓ మృత శిశువుకు జన్మనిచ్చింది. ఇది తెలిసి అతడు ఎంతో ఆవేదనకు లోనయ్యాడు. యాజమాన్యం సెలవుపై వెళ్లేందుకు అనుమతించినా.. జట్టు కోసం అంతటి బాధను మనసులో ఉంచుకొని బరిలోకి దిగాడు.

ఇవి కూడా చదవండి

అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు

Updated Date - Jul 01 , 2026 | 05:52 AM