డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్
ABN , Publish Date - Jan 27 , 2026 | 09:11 PM
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ అరెస్టయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మద్యం మత్తులో కారుతో పార్క్ చేసిన మూడు కార్లను ఢీకొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అప్పుడప్పుడు ప్రముఖులు పట్టుబడుతుంటారు. అలానే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఒకరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయ్యారు. గుజరాత్‌లోని వడోదరలో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్(53)(Jacob Martin Arrested)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ(జనవరి27) తెల్లవారుజామున మార్టిన్ తన లగ్జరీ కారుతో పార్క్ చేసి ఉన్న మూడు కార్లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, ఆయన వాహనం, ఇతర కార్లు బాగా దెబ్బతిన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం(జనవరి 27) తెల్లవారుజామున వడోదర(Vadodara) జిల్లా అకోటా ప్రాంతంలోని పునిత్ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయిన మార్టిన్.. పునిత్ నగర్‌లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన మూడు కార్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడి కారుతో పాటు పార్క్ చేసిన మూడు కార్లు బాగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే మార్టిన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలానే ప్రమాదానికి కారణమైన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జాకబ్ మార్టిన్ టీమిండియా తరఫున10 వన్డేలు ఆడాడు. అలానే దేశవాళీ మ్యాచుల్లో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో బరోడా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ప్రమాదంలో దెబ్బతిన్న కార్ల యజమానుల ఫిర్యాదు ఆధారంగా ఈ మాజీ క్రికెటర్‌పై ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం(Drunk driving) నడపడం వంటి బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్టిన్ ను 2011లో మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు