Share News

నాకు జీవించాలని లేదు.. టోర్నీ నుంచి తప్పించడంపై అథ్లెట్‌ ఆవేదన

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:57 PM

చివరి క్షణాల్లో ఆసియా క్రీడల నుంచి తన పేరును తొలగించడంపై ‘వుషు’ అథ్లెట్ దివ్యాన్షి తీవ్ర ఆవేదనకు గురైంది. ఆమె స్థానంలో అర్జున అవార్డు గ్రహిత రోషిబినా దేవీకి అవకాశం లభించింది.

నాకు జీవించాలని లేదు.. టోర్నీ నుంచి తప్పించడంపై అథ్లెట్‌ ఆవేదన
Divyanshi Wushu athlete

స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. జపాన్ వేదికగా జరిగే ఈ క్రీడలకు సర్వం సిద్ధమయ్యాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అథ్లెట్లు ఆతిథ్య దేశానికి చేరుకున్నారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నవారు. భారత్ నుంచి పలువురు అథ్లెట్లు జపాన్ వెళ్తున్నారు. ఈ క్రమంలో చివరి క్షణంలో ఆసియా క్రీడల నుంచి తన పేరు తప్పించడంపై దివ్యాన్షి అనే అథ్లెట్ మనస్తాపానికి గురైంది.


దివ్యాన్షి ‘వుషు’ (చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) అథ్లెట్ విభాగంలో ఆసియా క్రీడాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో ఆమె పేరు తొలగించి.. ఆ స్థానంలో రోషిబినా దేవీ అనే మరో అథ్లెట్‌కు అవకాశం లభించింది. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సోషల్ మీడియా వేదికగా దివ్యాన్షి ఓ వీడియోను పోస్టు చేసింది. తనను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని 18 ఏళ్ల ఈ వుషు అథ్లెట్ సంచలన ఆరోపణలు చేసింది. శిక్షణ సమయంలో అర్జున అవార్డు గ్రహిత అయిన రోషిబినా తనను కావాలనే గాయపరిచినట్లు దివ్యాన్షి పేర్కొంది.


‘నన్ను 60 కేజీల కేటగిరీ నుంచి తప్పించడం అన్యాయం. సెలక్షన్స్ ట్రయల్స్‌లో రోషిబినాను రెండుసార్లు ఓడించా. ఆసియా క్రీడల కోసం జపాన్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. అయితే, శ్రీనగర్ క్యాంపులో భుజానికి గాయమైంది. వైద్యుడి సూచన ప్రకారం టేపింగ్‌తో ఆడేందుకు అనుమతి వచ్చింది. ఇలాంటి సమయంలో నన్ను గాయం సాకుగా చూపి తొలగించారు. రోషిబినాను జట్టులోకి తీసుకున్నారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే నన్ను గాయపరిచింది. శిక్షణ శిబిరంలో ఎన్నోసార్లు మానసిక, శారీరక వేధింపులకు గురయ్యా. ఇక నాకు జీవించాలనే ఉద్దేశం లేదు’ అని దివ్యాన్షి పేర్కొంది. చివరగా భవనంపై నుంచి కిందికి చూపిస్తూ దివ్యాన్షి వీడియోను ముగించింది. రోషిబినా విషయానికి వస్తే 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది.


ఇవి కూడా చదవండి:

15 ఏళ్ల క్రితం నాటి సచిన్‌ ఔట్‌పై కామెంట్.. నెట్టింట పాక్‌ క్రికెటర్ నవ్వులపాలు!

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అవమానకర గోల్.. వీడియో వైరల్

Updated Date - Sep 12 , 2026 | 06:02 PM