బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలి.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:07 PM
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో బాల్ టాంపరింగ్ వివాదం దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ డేవిడ్ మలాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో బాల్ టాంపరింగ్ వివాదం దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పాక్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ దీనిపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచారణలో నిజాలు తేలడంతో ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం కూడా విధించారు. ఈ క్రమంలో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ డేవిడ్ మలాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
‘క్రికెట్ చరిత్రలో బాల్ టాంపరింగ్ అంశం కొత్తదేమీ కాదు. చాలా కాలంగా ప్లేయర్లు బాల్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది కూడా నైపుణ్యమే. కాబట్టి కొన్నిసార్లు దీనికి అనుమతినివ్వడంలో తప్పు లేదు. బయట నుంచి వేరే వస్తువులు ఉపయోగించకుండా కేవలం బాల్‌ను కొద్దిగా గీసి రివర్స్ స్వింగ్ పొందే అవకాశం ఇవ్వాలి. ఇది డెత్ ఓవర్లలో బౌలర్లకు మరింత సహకరిస్తుంది. ప్రస్తుత కాలంలో బ్యాటర్లు అత్యంత శక్తివంతంగా మారారు. దీంతో బౌలర్లకు సమతుల్యత కోల్పోయింది. ఎంత గొప్ప బౌలర్ అయినా బ్యాటర్లు ఫామ్‌లో ఉంటే పూర్తిగా చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది. బాల్ కొద్దిగా కదిలేలా చేయగలిగితే మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా మారుతాయి’ అని మలాన్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్ శెట్టి
మిస్టరీ స్పిన్నర్ తారిక్ బౌలింగ్‌లో ఆడటానికి ఇష్టపడని డారిల్ మిచెల్.. వీడియో వైరల్