బాప్రే.. హోప్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:40 AM
షాయ్ హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) శతకంతో కదం తొక్కగా.. పేసర్ కీమో పాల్ (5/41) నిప్పులు చెరిగాడు. దీంతో భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్ 2-2తో సమం చేసింది....
భారత్ టూర్లో నాలుగో శతకం
కీమో పాల్ పాంచ్ పటాకా
నాలుగో టీ20లో భారత్‌కు విండీస్ ఝలక్
సంజూ, తిలక్, నితీశ్ పోరాటం వృథా
హైదరాబాద్: షాయ్ హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) శతకంతో కదం తొక్కగా.. పేసర్ కీమో పాల్ (5/41) నిప్పులు చెరిగాడు. దీంతో భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్ 2-2తో సమం చేసింది. బుధవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 24 పరుగుల తేడాతో విండీస్ చేతిలో చిత్తయింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 247/3 స్కోరు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (49 నాటౌట్), షిమ్రన్ హెట్మయర్ (33) రాణించారు. ప్రిన్స్, అక్షర్, అర్ష్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. చేధనలో భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), తిలక్ వర్మ (43), నితీశ్ కుమార్ (41) మినహా మిగతావారు విఫలమయ్యారు. గుడకేష్ మోటీ రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. విండీస్ కెప్టెన్ హోప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్ నిర్ణాయక ఆఖరి మ్యాచ్ శనివారం బెంగళూరులో జరగనుంది.
పవర్‌ప్లేలో పరుగులు పెట్టినా..
భారీ ఛేదనలో ఓపెనర్ శాంసన్ తుఫాన్‌లా చెలరేగినా.. ఆ తర్వాతి టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో తిలక్, నితీశ్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభంలో విండీస్ బౌలర్లను ఉతికి ఆరేసిన సంజూ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (29)తో కలసి తొలి వికెట్‌కు 26 బంతుల్లో 60 పరుగులు జోడించాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన శాంసన్, రెండో ఓవర్లో 4,6,6 బాదాడు. అనంతరం చేజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 25 పరుగులు రాబట్టడంతో.. మూడో ఓవర్లోనే టీమిండియా స్కోరు 50 మార్క్ అందుకొంది. అయితే, ఐదో ఓవర్లో శాంసన్‌తోపాటు వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6)ను కూడా అవుట్ చేసిపాల్ గట్టిదెబ్బకొట్టాడు. కానీ, శర్మ, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (16) చెరో బౌండ్రీ బాదడంతో ఆరు ఓవర్లకు భారత్ 80/2తో నిలిచింది. మధ్య ఓవర్లలో స్కోరు బోర్డు ఓ మాదిరిగా సాగుతున్న సమయంలో స్ర్పింగర్ బౌలింగ్‌లో శ్రేయాస్ క్యాచవుటయ్యాడు. స్తబ్ధుగా ఉన్న అభిషేక్ క్రమంగా దూకుడు పెంచే ప్రయత్నం చేయగా.. క్రీజులోకి వచ్చిన తిలక్ కూడా వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడడంతో సగం ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 115/3తో విండీస్‌కు దీటుగా నిలిచింది. కానీ, మోటీ వేసిన 12వ ఓవర్లో అభిషేక్, నమన్ ధిర్ (0) వరుస బంతుల్లో అవుట్ కావడంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్, నితీశ్ ఆరో వికెట్‌కు 70 పరుగులతో ఆశలు రేపారు. ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు కావాల్సి ఉండగా.. 16వ ఓవర్లో నితీశ్ 4,6,6తో 21 పరుగులు రాబట్టాడు. కానీ, షెపర్డ్ బౌలింగ్‌లో తిలక్ అవుట్ కావడంతో టీమిండియా ఓటమి లాంఛనమే అయింది. 19వ ఓవర్లో నితీశ్, ప్రిన్స్ (0), అక్షర్ (3)ను పాల్ అవుట్ చేశాడు.
విరుచుకుపడ్డ విండీస్ బ్యాటర్లు..
కెప్టెన్ హోప్ అద్భుత సెంచరీతోపాటు మిగతా బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ సవాల్ విసరగలిగే స్కోరు చేసింది. తుదికంటా క్రీజులో నిలిచిన హోప్.. రూథర్‌ఫోర్డ్‌తో కలసి నాలుగో వికెట్‌కు అజేయంగా 43 బంతుల్లో 91 పరుగులు జోడించడంతో.. టీమ్ స్కోరు 250 మార్క్‌కు చేరువైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు హాప్, జువెల్ ఆండ్రూ (21) తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, ఐదో ఓవర్లో జువెల్ను అవుట్ చేసిన అక్షర్ జట్టుకు బ్రేక్ అందించాడు. ఇక, వన్‌డౌన్‌లో వచ్చిన హెట్మయర్ కూడా ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో.. 8వ ఓవర్లోనే విండీస్ 109/1తో పటిష్టస్థితిలో నిలిచింది. కానీ, జోరుమీదున్న హెట్మయర్ను ప్రిన్స్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పావెల్ (24), హోప్ మూడో వికెట్‌కు 46 రన్స్ జోడించారు. పావెల్‌ను అర్ష్‌దీప్ క్యాచవుట్ చేసినా.. హోప్‌తో కలసి రూథర్‌ఫోర్డ్ డెత్ ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 17వ ఓవర్లో మయాంక్ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్ 6,4,6తో ఏకంగా 22 పరుగులు పిండుకోవడంతో టీమ్ స్కోరు 200 మార్క్ దాటింది. ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదిన హోప్ సెంచరీని పూర్తి చేసుకొన్నాడు.
స్కోరుబోర్డు
వెస్టిండీస్: హోప్ (నాటౌట్) 102, ఆండ్రూ (ఎల్బీ) అక్షర్ 21, హెట్మయర్ (సి అండ్ బి) ప్రిన్స్ 33, పావెల్ (సి) సంజూ (బి) అర్ష్‌దీప్ 24, రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 49; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 247/3; వికెట్ల పతనం: 1-52, 2-110, 3-156; బౌలింగ్: మయాంక్ 4-0-52-0, అర్ష్‌దీప్ 4-0-52-1, ప్రిన్స్ 4-0-36-1, అక్షర్ 4-0-45-1, నమన్ 1-0-19-0, నితీశ్ 3-0-39-0.
భారత్: శాంసన్ (సి) హెట్మయర్ (బి) పాల్ 56, అభిషేక్ (సి) స్ర్పింగర్ (బి) మోటీ 29, ఇషాన్ (సి) ఆండ్రూ (బి) పాల్ 6, అయ్యర్ (సి) ఆండ్రూ (బి) స్ర్పింగర్ 16, తిలక్ వర్మ (సి) పావెల్ (బి) షెపర్డ్ 43, నమన్ (స్టంప్డ్) హోప్ (బి) మోటీ 0, నితీశ్ (సి) పావెల్ (బి) పాల్ 41, అక్షర్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) పాల్ 3, ప్రిన్స్ (బి) పాల్ 0, అర్ష్‌దీప్ (రిటైర్డ్ అవుట్) 5, మయాంక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 19.3 ఓవర్లలో 223 ఆలౌట్; వికెట్ల పతనం: 1-60, 2-67, 3-97, 4-130, 5-130, 6-200, 7-212, 8-212, 9-213; బౌలింగ్: చేజ్ 4-0-43-0, జోసెఫ్ 2.3-0-47-0, షెపర్డ్ 3-0-32-1, కీమో పాల్ 4-0-41-5, స్ర్పింగర్ 4-0-40-1, గుడకేష్ 2-0-13-2.
1
ఉప్పల్ స్టేడియంలో భారత్‌కిదే తొలి టీ20 ఓటమి. గతంలో ఇక్కడ ఆడిన మూడు టీ20మ్యాచుల్లోనూ టీమిండియా గెలిచింది.
4
ఈ టీ20 సిరీస్‌లో హోప్‌కు ఇది రెండో శతకం కాగా.. మొత్తంగా ఈ టూర్లో నాలుగో సెంచరీ.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో