పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:36 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు అంతర్జాతీయ మ్యాచుల్లో పంత్.. తనదైన శైలీలో బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాక పంత్ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడే వారు. తర్వాత అకస్మాత్తుగా ఫామ్ కోల్పోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2025లో అయితే పంత్ దారుణంగా విఫలమయ్యాడు.13 మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
పంత్ సారథ్యంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గతేడాది 14 మ్యాచుల్లో 6 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు
జియో హాట్‌స్టార్ నిర్వహించిన ఓ షోలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘రిషభ్ పంత్ పై విమర్శలు రావడం సరైనదే. సాధారణ ఆటకు విరుద్ధంగా, రిస్కీ షాట్లు ఆడటం అనే చక్రంలో అతడు చిక్కుకున్నాడు. అలానే ఫామ్‌ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లు ఆడి విమర్శలు మూటగట్టుకున్నాడు. 2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు
'మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ వికెట్ కీపర్‌గా సేవలు అందించే పంత్ గురించి ఇప్పుడు టీమిండియా సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు. ఓపెనర్ వికెట్ కీపర్‌గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజు శాంసన్), ఓపెనర్- వికెట్ కీపర్ లేదంటే వన్‌డౌన్‌లో ఆడే ప్లేయర్‌గా మరొకరు (ఇషాన్ కిషన్) అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే ఛాన్స్ అయినా పంత్‌కు దక్కుతుంది. అయితే యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో పంత్ ప్రాక్టీస్ చేయడం శుభ పరిణామం. ఈసారైనా పంత్ చక్కగా రాణించాలి. లేదంటే భవిష్యత్ కష్టమే’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
కావ్య పాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!
డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్