కొత్త కోచ్ వేటలో సీఎస్కే.. ధోని పెట్టిన షరతులివేనా..?
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:38 PM
సుదీర్ఘకాలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగి రెండు నెలలైంది. ఇంకా కొత్త కోచ్ ఎవరనేదానిపై సీఎస్కే ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో సీఎస్కే యాజమాన్యంకు ఎంఎస్ ధోని రెండు కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ టోర్నీలో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఇప్పటి వరకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం సీఎస్కే జట్టుకు హెచ్ కోచ్‌గా సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ రెండు నెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో కొత్త కోచ్ కోసం సీఎస్కే యాజమాన్యం వేట సాగిస్తోంది. ఇదే సమయంలో తరచూ ఫలానా వ్యక్తి.. సీఎస్కే హెచ్ కోచ్ అంటూ పలువురి పేర్లు వార్తల్లో వినిపిస్తుంటాయి. కానీ, అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు. అయితే వచ్చే వారంలోనే సీఎస్కే ఓ నిర్ణయానికి రానుందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో హెచ్ కోచ్ ఎంపిక విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఎంఎస్ ధోని.. మేనేజ్‌మెంట్ ముందు రెండు షరతులు పెట్టినట్లు సమాచారం. అందులో మొదటిది... ప్రధాన కోచ్‌గా రాబోయే వ్యక్తి భారత్‌కు చెందిన వారై ఉండాలి. అలాగే, సహాయక సిబ్బందిని కూడా ఇక్కడి నుంచే తీసుకోవాలట. స్టీఫెన్ ఫ్లెమింగ్ బదులు ప్రధాన కోచ్ అవకాశం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీకి వస్తుందని చాలా మంది భావించారు. తాజాగా ధోని షరతు అతడికి అవకాశాలను సంక్లిష్టం చేస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హస్సీ గత కొన్నేళ్లుగా సీఎస్కేకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ఇక ధోని రెండో కండీషన్ విషయానికి వస్తే.. కొత్తగా వచ్చే హెడ్ కోచ్ కేవలం సీఎస్కేతోనే పనిచేయాలి. గతంలో ఫ్లెమింగ్(న్యూజిలాండ్) జోహెన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లకు కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. తాజాగా ధోని పెట్టిన కండీషన్ ప్రకారం... సీఎస్కే హెడ్ కోచ్‌గా ఎంపికైన వ్యక్తికి.. ఇదే ఫ్రాంచైజీకి ఉన్న మిగతా లీగుల్లోని జట్లతో సంబంధం ఉండకూడదు.
ధోని షరతుల నేపథ్యంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ అయిన హేమంగ్ బదానీ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌కు చెందిన బదానీకి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. అలానే అతడికి ధోనితో మంచి సంబంధాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరి.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ధోని షరతుల ప్రకారమే ముందుకు వెళ్తుందా.. లేదా వేరే నిర్ణయం తీసుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సింది.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటంపై మౌనం వీడిన రోహిత్ శర్మ
ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించిన బుమ్రా... అఫ్గాన్‌తో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్