ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని ఆడడు: సీఎస్కే మాజీ ప్లేయర్
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:39 PM
ఎంఎస్ ధోని అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోని పూర్తి స్థాయి ప్లేయర్‌గా బరిలో దిగనున్నాడు. ఇదే విషయాన్ని సీఎస్కే మాజీ ఆటగాడు బద్రినాథ్ వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఒకటి. ఈ జట్టు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది.. మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అతడు బ్లూ జెర్సీలో ఎంత ఇంపాక్ట్ చూపించారో.. ఎల్లో జెర్సీలో కూడా అంతే స్థాయిలో తన మార్క్‌ను చూపించాడు. గత ఐపీఎల్‌లో పూర్తిస్థాయి ప్లేయర్‌గా ధోని మైదానంలోకి దిగకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సారి కూడా అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గానే జట్టులో ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ప్లేయర్ బద్రినాథ్.. ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2027లో తలా(ధోని) తప్పకుండా ఆడతాడని వెల్లడించాడు.
బద్రినాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. 'ధోని నాతో వ్యక్తిగతంగా ఓ మాట చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాదు.. ఫుల్‌టైమ్ వికెట్ కీపర్‌గానే ఆడతానని అన్నాడు. అంటే ధోని 20 ఓవర్లు మైదానంలోనే ఉంటాడు. ఒకవేళ నిజంగానే ధోని బరిలోకి దిగితే చెన్నై జట్టుకు ప్రయోజనం ఉంటుంది. కానీ, ధోని శరీరం అంత సమయం సహకరిస్తుందా? అనేది అనుమానం. ధోని ఎక్కువగా 16 లేదా 17వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వస్తుంటాడు. బ్యాటింగ్ సమయంలో అతడి పాత్ర చాలా పరిమితంగానే ఉంటుంది’ అని బద్రినాథ్ తెలిపాడు.
ఇదే సమయంలో యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గురించి బద్రినాథ్ ప్రస్తావించాడు. అతడి బౌలింగ్ టీమిండియాకు అవసరం కానీ, సీఎస్కేకు కాదని అభిప్రాయపడ్డాడు. దూబే విషయంలో ఇంపాక్ట్ రూల్‌ను వినియోగించాల్సిన పనిలేదని తెలిపాడు. అలాగే అకీల్ హుస్సేన్‌ను తప్పకుండా తుది జట్టులో ఉంచాలని, సీఎస్కే మాత్రం అతడిని ఇంప్టాక్‌గానే తీసుకొస్తోందని బద్రినాథ్ తెలిపాడు. ఇక్కడ ఇంపాక్ట్ రూల్‌ను తప్పుబట్టేందుకు ఏమీ లేదని, సరిగ్గా ఉపయోగించుకునే వ్యూహం ఆయా జట్లకే ఉండాలని బద్రినాథ్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
వాళ్లు ఓడలేదా?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు