ప్లేయర్‌గా బై మెంటార్‌గా సై
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:14 AM
చెన్నై సూపర్ కింగ్స్‌ను అంతా తానై నడిపించిన ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ శకం ముగిసింది. 45 ఏళ్ల వయస్సులో ఇక ఆటగాడిగా కొనసాగలేనని ప్రకటించాడు
ఇకపై సీఎస్‌కే మార్గదర్శకుడిగానే..
చెన్నై:చెన్నై సూపర్ కింగ్స్‌ను అంతా తానై నడిపించిన ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ శకం ముగిసింది. 45 ఏళ్ల వయస్సులో ఇక ఆటగాడిగా కొనసాగలేనని ప్రకటించాడు. అయితే ప్లేయర్‌గా వైదొలిగినా.. ఇక నుంచి ధోనీ సీఎస్‌కే మెంటార్‌గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ పేర్కొంది. వాస్తవానికి తను ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో గాయం పేరిట ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గోవాలో వచ్చే నెల ఆటగాళ్ల మినీ వేలం జరుగబోతోంది. దీంట్లో భాగంగా మంగళవారం ఆయా జట్లు తాము విడుదల చేసే ఆటగాళ్ల జాబితాకు తుది గడువు కావడంతో సీఎస్‌కే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు
మైదానంలోకి అడుగుపెడితే ఒక తుఫాన్.. క్రీజులో నిలబడితే జట్టుకు భరోసా.. వికెట్ల వెనకాల ఉంటే అద్భుతమే. ఐపీఎల్ అంటే చెన్నై.. చెన్నై అంటే ఎంఎస్ డీ అన్నంతగా లీగ్‌తో మమేకమైన మహేంద్ర సింగ్ ధోనీ ఆట ముగిసింది. పసుపు రంగు ఏడో నెంబర్ జెర్సీ మైదానంలో దిగితే చెవులు చిల్లులు పడేలా ధోనీ.. ధోనీ అనే నామస్మరణ ఇక వినిపించదు. మెరుపు స్టంపింగ్‌లు.. హెలికాప్టర్ షాట్లతో దాదాపు రెండు దశాబ్ధాలు ఐపీఎల్‌ను శాసించిన మహీ ఇక బ్యాట్, గ్లోవ్స్‌ను పక్కనబెట్టడంతో క్రికెట్ అభిమానుల హృదయం బరువెక్కింది. కేవలం ట్రోఫీలు గెలవడమే కాదు.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్న ‘తలా’ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో లీగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం ముగిసినట్టయ్యింది.
అత్యుత్తమ సారథిగా..
2008లో తొలి సీజన్‌లో చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ప్రస్థానం ఆరంభమైంది. అంతకు ముందు ఏడాది అతడి సారథ్యంలోనే భారత్ 2007 టీ20 వరల్డ్‌కప్ అందుకుంది. అదే జోరులో తను లీగ్‌లోనూ సీఎస్‌కేను అద్భుతంగా నడిపించాడు. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో చాంపియన్‌గా నిలవడమే కాకుండా 2010, 2014 చాంపియన్స్ లీగ్ టైటిళ్లను కూడా ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు ఐపీఎల్‌లను గెలిచిన తొలి జట్టుగానే కాకుండా ఒకే ఏడాది ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ గెలిచిన ఏకైక జట్టుగా చెన్నై నిలిచింది. అంతేకాకుండా లీగ్‌లో పదిసార్లు ఫైనల్‌కు వెళ్లిన ఏకైక టీమ్ కూడా సీఎస్‌కేనే. మొత్తం 19 సీజన్లలో ఎంఎస్ ధోనీ చెన్నై జట్టు తరఫున 17సార్లు బరిలోకి దిగాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జట్టుపై నిషేధం విధించడంతో 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ఆడాడు. ఆ తర్వాత 2018లో సీఎస్‌కేను చాంపియన్‌గా నిలిపి గర్వపడేలా చేశాడు. 2024 టోర్నీ ఆరంభానికి ముందు రుతురాజ్‌ను కెప్టెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2024, 2025లోనూ ధోనీ చివరి ఓవర్లలోనే బ్యాటింగ్‌కు దిగాడు. 2026లో అసలు బరిలోకే దిగకపోవడం తెలిసిందే.
మహీ ముద్ర ప్రత్యేకం
దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా.. ఆ వేదికలన్నీ పసుపుమయంగా మారడం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం ఆ ఒక్కడే.. కోట్లాది క్రికెట్ ప్రేమికులను తన బ్యాటింగ్, కీపింగ్ విన్యాసాలతోనే కాకుండా తన నడవడికతోనూ మహేంద్ర సింగ్ ధోనీ ఆకట్టుకోగలిగాడు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ ఆడినా.. అభిమానులు పోటెత్తుతుంటారు. ‘విజిల్ పోడు’ అంటూ స్టేడియాల్లో సందడి చేస్తుంటారు. ఇక తమిళ తంబీలైతే ఎంఎస్ ధోనీని క్రికెట్ దేవుడిగానే భావిస్తుంటారు. 20 ఏళ్లుగా వారికి అతడితో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. గతంలో ఓసారి చెన్నై మ్యాచ్‌లకు పుణెను హోం గ్రౌండ్‌గా ఎంపిక చేయడంతో ప్రత్యేక రైళ్లను వేసుకుని మరీ తమ జట్టు మ్యాచ్‌లను తిలకించారు. ఐపీఎల్‌లో ఈ జట్టు ఫ్యాన్స్‌ను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. అటు తమ అభిమాన క్రికెటర్‌ను తమిళులంతా ముద్దుగా ‘తలా’ (నాయకుడు) అని పిలుచుకోవడం పరిపాటి.
ఒకసారి నమ్మాడంటే..
మిన్ను విరిగి మీద పడినా ప్రశాంతచిత్తంతో ఉండే మనస్తత్వం ధోనీది. ఎలాంటి తొందరపాటు లేకుండా స్థిమితంగా ఆలోచించడం.. వ్యూహాత్మక ఎత్తులతో ప్రత్యర్థులను ఉచ్చులోకి లాగి పెవిలియన్‌కు చేరేలా తన నిర్ణయాలు ఉంటాయి. పరిస్థితులు ఎంత పట్టు తప్పుతున్నా కూల్‌గా ఉండడం ధోనీ కెప్టెన్సీ స్టైల్. ఒకసారి టిఆర్ఎస్‌కు వెళ్లాడంటే తిరుగుండదు. అంతేకాకుండా సహచరులపై అపార నమ్మకం పెట్టుకోవడం కూడా అతడి విజయాల్లో కీలకంగా నిలిచింది. జట్టులో పెద్దగా మార్పులు చేసేందుకు ఇష్టపడడు. ఓ ఆటగాడు విఫలమైనా అతడికి పదేపదే అవకాశాలిచ్చి ఆత్మవిశ్వాసం పెరిగేలా చేయడం అతడి శైలి. ఇక కొత్త పాత్రలో ‘చెన్నై’ని మరింత ‘సూపర్’గా తయారుచేసి ధోనీ తమ జట్టును ఐపీఎల్ ‘కింగ్స్’ అనిపించుకునేలా చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
ఐపీఎల్ కెరీర్..
మ్యాచ్‌లు 278
పరుగులు 5439
అత్యధికం 84 నాటౌట్
శతకాలు 0
అర్ధ శతకాలు 24
క్యాచ్‌లు 158
స్టంపింగ్‌లు 47
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ