జెన్ జీ, జెన్ ఆల్ఫా తరానికి ఎంఎస్ ధోనీ కీలక సందేశం
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:59 PM
ప్రస్తుత జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) తరాలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచించారు. మారుతున్న జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) తరాలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచించారు. మారుతున్న జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. చిన్నప్పటి నుంచే క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రోజులో కనీసం గంట సమయాన్ని ఫిట్నెస్ కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు.రచయిత, గేయరచయిత జావేద్ అఖ్తర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. యువత ఆరోగ్యం గురించి కీలక విషయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రీడాకారులు కావాల్సిన అవసరం లేదని, అయితే శారీరక చురుకుదనాన్ని జీవితంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు.
ఆహారం అదే.. శారీరక శ్రమే తగ్గింది..
గతంలో ప్రజల దైనందిన జీవితంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేదని ధోనీ గుర్తుచేశారు. అప్పటి ఆహారపు అలవాట్లు కూడా ఆ జీవనశైలికి అనుగుణంగా ఉండేవన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వివరించారు. ‘‘గతంలో ఉన్న ఆహారపు అలవాట్లే ఇప్పటి తరానికి కొనసాగాయి. కానీ శారీరక శ్రమ మాత్రం గణనీయంగా తగ్గిపోయింది’’ అని ధోనీ పేర్కొన్నారు. గతంలో నడక, శారీరక శ్రమ రోజువారీ జీవితంలో సహజంగా భాగంగా ఉండేవని.. ఇప్పుడు చిన్న దూరాలకు వెళ్లేందుకు కూడా వాహనాలపై ఆధారపడుతున్నారని.. కార్యాలయాల్లో గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారని వివరించారు. దీనికి తోడు ఫాస్ట్‌ఫుడ్, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారాల వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమందిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నప్పటికీ.. సమాజంలోని ఎక్కువ మందికి ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని ధోనీ అభిప్రాయపడ్డారు.
పిల్లలను ఆటల వైపు మళ్లించాలి..
పిల్లలను చిన్న వయసు నుంచే వివిధ క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ధోనీ సూచించారు. ఒకే ఆటకు పరిమితం చేయకుండా.. వారికి ఆసక్తి ఉన్న క్రీడలను ప్రయత్నించే అవకాశం ఇవ్వాలన్నారు. అలా పిల్లలు తమకు నచ్చిన ఆటను ఎంచుకోవడంతోపాటు శారీరక శ్రమకు అలవాటు పడతారని వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ క్రీడాకారులు కావాల్సిన అవసరం లేదని.. అయితే చిన్నప్పటి నుంచి క్రీడల్లో పాల్గొనడం జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ‘‘30–35 ఏళ్లు దాటిన తర్వాత క్రీడలు ఆడినవారు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చినవారు మధ్య వయసులో మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని మీరు గుర్తిస్తారు’’ అని ధోనీ పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయని.. అలాంటి సమయంలో శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యమని చెప్పారు. పిల్లలతో కలిసి ఆడుకోవడం వంటి రోజువారీ ఆనందాలను ఆస్వాదించాలన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
రోజులో గంట.. మీ ఆరోగ్యం కోసం..
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని.. రోజులో ఒక గంట కేటాయించడం ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చని ధోనీ సూచించారు. ‘‘అన్నింటికంటే ముఖ్యమైనది మీపై మీరు పెట్టుకునే పెట్టుబడి. 24 గంటల్లో ఒక గంటను మీ కోసం కేటాయించండి’’ అని అన్నారు. వ్యాయామంతోపాటు ఆహారపు అలవాట్లను కూడా మెరుగుపరచుకోవాలని సూచించారు. శారీరక చురుకుదనం కోసం నడక, సైక్లింగ్, ఈత లేదా తమకు నచ్చిన ఏదైనా క్రీడను ఎంచుకోవచ్చని ఆయన అభిప్రాయం. క్రీడలు శారీరక దృఢత్వానికే పరిమితం కావని ధోనీ పేర్కొన్నారు. ఆటల్లో ఎదురయ్యే గెలుపోటములు జీవితంలోనూ ఉపయోగపడే ఎన్నో లక్షణాలను నేర్పిస్తాయని వివరించారు. ఓటమిని ఎలా స్వీకరించాలి? గెలిచినప్పుడు ఎలా ప్రవర్తించాలి? మనలోని లోపాలను గుర్తించి వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాలను క్రీడలు నేర్పుతాయని చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదని.. మనపై ఆధారపడినవారు, మనల్ని ప్రేమించే వారి కోసం కూడా ఆరోగ్యంగా ఉండాలని ధోనీ సూచించారు. సొంత ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేకపోయినా.. కనీసం కుటుంబ సభ్యుల కోసం అయినా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు.