Share News

ఐపీఎల్ 2026: నిరాశలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:01 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భీకర్ ఫామ్ ప్రదర్శించి.. భారత్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లీగ్‌లో ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు.

ఐపీఎల్ 2026: నిరాశలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు
Sanju Samson struggles

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2026లో అద్బుత ప్రదర్శన చేసి... టీమిండియా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజు శాంసన్‌.. మెగా టోర్నీ పూర్తైన కొద్ది రోజులకే ఫామ్‌ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో అతను ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ అయిన సంజు.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు.


రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటైన సంజూ.. ఇవాళ (ఏప్రిల్‌ 3) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 7 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ లీగ్ ప్రారంభం ముందు వరకు భీకర ఫామ్‌లో ఉన్న సంజు తమ జట్టులోకి వచ్చే సరికి వరుసగా విఫలం​ కావడాన్ని సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొట్టి ప్రపంచ కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న సంజుపై సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. అయితే అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తేలిపోవడంతో అభిమానులతో పాటు ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం తలలు పట్టుకుంది.


ఇప్పటికే ఆ జట్టుకు ధోని అందుబాటులో లేడు. యువ చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ సైతం గాయం కారణంగా ఈ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువకులతో నిండిన ప్రస్తుత జట్టులో సంజునే సీనియర్ కావడం గమనార్హం. ఇవాళ మ్యాచ్‌లో సంజు.. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది, ఆ మరుసటి బంతికే వికెట్‌ కీపర్‌ ప్రభ్‌ సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక తర్వాత మ్యాచుల్లో ఎలా ఆడుతాడో అని సీఎస్కే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

అజింక్య ర‌హానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్?

మ్యాచ్‌ల సంఖ్య పెంపు!.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 03 , 2026 | 09:10 PM