Share News

10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం....

ABN , Publish Date - Mar 08 , 2026 | 03:29 PM

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది.

10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం....
India Women vs Australia Women Test

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్‌.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌ ను ఆసీస్‌కు సమర్పించుకుంది. తాజాగా ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా ఓడి, సిరీస్‌ను కోల్పోయింది.


ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. 62.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 4, లూసీ హ్యామిల్టన్‌ 3, డార్సీ బ్రౌన్‌ 2 వికెట్లు సాధించారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ (52) ఒక్కరే అర్ద శతకంతో రాణించారు. షఫాలీ వర్మ (35), ఆఖర్లో కశ్వీ గౌతమ్‌ (34 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.


అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 323 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బంతితో సత్తా చాటిన సదర్‌ల్యాండ్‌ బ్యాట్‌తోనూ చెలరేగి సూపర్‌ సెంచరీ (129)తో ఆకట్టుకుంది. ఎల్లిస్‌ పెర్రీ (76) అర్ద సెంచరీతో రాణించంది. మిగిలిన ప్లేయర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ కి క్యూ కట్టారు. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరే 4, క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ చెరో 2, స్నేహ్‌ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్‌ సాధించారు. ఇక 125 పరుగులు వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ ‍ప్రారంభించిన భారత్‌ బ్యాటర్ల.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. తొలి ఇన్నింగ్స్ కంటే దారుణంగా రెండో ఇన్నింగ్స్ సాగింది. ఆసీస్ బౌలర్ల దెబ్బకు 149 పరుగులకే ఆలౌటైంది.


హ్యామిల్టన్‌ 3, అలానా కింగ్‌ 2, ఆష్లే గార్డ్‌నర్‌2, సదర్‌ల్యాండ్‌ 2, డార్సీ బ్రౌన్‌ ఒక వికెట్ సాధించారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతీక రావల్‌ (63) ఒంటరిపోరాటం చేసింది. కెప్టెన్‌ హర్మన్‌(11), జెమీమా (14) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. ఆఖర్లో స్నేహ్‌ రాణా (30) ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించింది. అనంతరం 25 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 4.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా సునాయసంగా విజయాన్ని అందుకుంది. జార్జియా వాల్‌ 16, లిచ్‌ఫీల్డ్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ ఏకైక మ్యాచ్‌ మూడో రోజు తొలి సెషన్‌లోనే ముగిసింది. ఆసీస్ ప్లేయర్ సదర్‌ల్యాండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకుంది.


ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 08 , 2026 | 03:29 PM