Share News

సిరీస్‌ ఇక్కడే పట్టేస్తారా?

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:30 AM

భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో కీలక మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా మరో విజయం సాధిస్తే చాలు.. సిరీస్‌ను దక్కించుకోవచ్చు...

సిరీస్‌ ఇక్కడే  పట్టేస్తారా?

రాత్రి 7 గంటల నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో...

నేడు నాలుగో టీ20

గెలుపే ధ్యేయంగా భారత్‌

వెస్టిండీస్‌ కు చావోరేవో

హైదరాబాద్‌: భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో కీలక మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా మరో విజయం సాధిస్తే చాలు.. సిరీస్‌ను దక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే నాలుగో టీ20లో శ్రేయాస్‌ సేన గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగనుంది. అటు రెండో మ్యాచ్‌లో గెలిచి పోటీలోకొచ్చిన విండీస్‌కు నేటి పోరు చావో రేవో కానుంది. ఎందుకంటే సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే కరీబియన్లకు గెలుపు తప్పనిసరి. అలా అయితేనే సిరీస్‌ను 2-2తో సమం చేసి చివరి మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకువీలుంటుంది. అదీగాకుండా బ్యాటర్లకు అనుకూలించే పిచ్‌పై తమ హిట్టర్లు చెలరేగితే భారత్‌ను అడ్డుకోవడం సాధ్యమేనని విండీస్‌ భావిస్తోంది.

జోష్‌లో భారత్‌: తొలి మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచిన భారత్‌కు రాంచీలో మాత్రం చుక్కెదురైంది. 249 పరుగులను సైతం కరీబియన్ల బాదుడుకు కాపాడుకోలేకపోయింది. కానీ ఆ అనూహ్య ఓటమి నుంచి త్వరగానే కోలుకుని మూడో టీ20లో రెండు విభాగాల్లోనూ సత్తా చాటుకుంది. ఐపీఎల్‌లో భారీ స్కోర్లు సాధించే సన్‌రైజర్స్‌ జట్టు బ్యాటర్లయిన అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లకు ఉప్పల్‌ గ్రౌండ్‌ సొంత మైదానమే. దీంతో వీరి నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ను ఆశించవచ్చు. ఇంకో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఆటలో నిలకడ లోపిస్తోంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాణిస్తేనే అతడిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక హైదరాబాదీ తిలక్‌కు సైతం ఈ గ్రౌండ్‌ కొత్తేం కాదు. ఇండోర్‌లో విఫలమైన కెప్టెన్‌ శ్రేయాస్‌ తిరిగి బ్యాట్‌ ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో పేసర్లు అర్ష్‌దీప్‌, మయాంక్‌ కట్టడి చేయగలుగుతున్నారు. స్పిన్నర్లు నమన్‌, అక్షర్‌ పరుగులు ఇచ్చినా వికెట్లు తీయడం సానుకూలాంశం. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. కాబట్టి కుల్దీప్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండాల్సి రావచ్చు.

విండీస్‌పైనే ఒత్తిడి: సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ను ఇండోర్‌లో భారత్‌ కట్టడి చేయగలిగింది. అయితే హెట్‌మయెర్‌, కమిల్‌ ఫామ్‌లోకి రావడం వారికి అనుకూలించే విషయం. రోవ్‌మన్‌ పోవెల్‌ సిరీస్‌లో విఫలమవుతూనే ఉన్నాడు. రూథర్‌ఫోర్డ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ కనబర్చుతుండగా, టెయిలెండర్‌ షామార్‌ స్ర్పింగర్‌ అదిరే ఆటతో ఓటమి అంతరాన్ని గణనీయంగా తగ్గించగలిగాడు. నేటి కీలక పోరులో హిట్టర్లంతా కలిసికట్టుగా చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. గాయపడిన రొమారియో షెఫర్డ్‌ ఫిట్‌నె్‌సపై స్పష్టత లేదు. బౌలింగ్‌లో స్పిన్నర్‌ రోస్టన్‌ చేజ్‌ ప్రధాన ఆయుధంగా మారాడు. అతను ఆరు వికెట్లతో సిరీస్‌ టాపర్‌గా కొనసాగుతుండడం విశేషం. జోరు మీదున్న భారత బ్యాటర్లను వైవిధ్యమైన బంతులతో కట్టడి చేస్తున్నాడు. రాంచీలో అతడు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబేలను అవుట్‌ చేయడంతోనే జట్టు గెలవగలిగింది. మరోసారి జట్టు చేజ్‌పైనే ఆధారపడిందనడంలో సందేహం లేదు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌, శ్రేయాస్‌ (కెప్టెన్‌), తిలక్‌, నమన్‌ ధిర్‌, నితీశ్‌ కుమార్‌, అక్షర్‌, ప్రిన్స్‌, మయాంక్‌, అర్ష్‌దీప్‌.

వెస్టిండీస్‌: హోప్‌ (కెప్టెన్‌), కమిల్‌, హెట్‌మయెర్‌, పోవెల్‌, రూథర్‌ఫోర్డ్‌, షెఫర్డ్‌/శాంప్సన్‌, చేజ్‌, స్ర్పింగర్‌, పాల్‌, జోసెఫ్‌, మోటీ.

పిచ్‌

ఉప్పల్‌ వికెట్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. గత రెండేళ్లలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఆరంభంలో కొత్త బంతితో పేసర్లకు కాస్త సహకారం లభించే అవకాశముంది.

3

ఉప్పల్‌ మైదానంలో జరిగిన మూడు టీ20ల్లోనూ భారత్‌ గెలిచింది.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:30 AM