కివీస్ కమాల్ 89కే ఢమాల్
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:19 AM
ఓ పసికూన జట్టు మాదిరి ఏమిటీ ప్రదర్శన? న్యూజిలాండ్ విధించిన 334 పరుగుల లక్ష్యం అంత సులువేమీ కాకపోయినా.. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లతో కూడిన టీమిండియా కనీసం వంద పరుగులైనా చేయలేక బ్యాట్లెత్తేయడం సగటు అభిమాని జీర్ణించుకోలేని విషయం..
చేతులెత్తేసిన భారత బ్యాటర్లు
244 రన్స్‌తో కివీస్ విజయం
ఫిషర్‌కు 3 వికెట్లు
యంగ్ సెంచరీ
మౌంట్‌మాంగనూయి: ఓ పసికూన జట్టు మాదిరి ఏమిటీ ప్రదర్శన? న్యూజిలాండ్ విధించిన 334 పరుగుల లక్ష్యం అంత సులువేమీ కాకపోయినా.. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లతో కూడిన టీమిండియా కనీసం వంద పరుగులైనా చేయలేక బ్యాట్లెత్తేయడం సగటు అభిమాని జీర్ణించుకోలేని విషయం.. ఏడాది తర్వాత వన్డే బరిలోకి దిగిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ (6/27) అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి మన జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. మిగతా పేసర్లు మాథ్యూ ఫిషర్ (3/31), జేమీసన్ (1/12) కూడా చెలరేగడంతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 244 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్.. భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక ఇదే వేదికపై ఆదివారం జరిగే ఆఖరిదైన ఐదో మ్యాచ్‌లోనూ శాంట్నర్ సేన గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు విల్ యంగ్ (108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 125) సెంచరీ, టిమ్ సైఫర్ట్ (58) హాఫ్ సెంచరీలతో అదర గొట్టగా, ఫిన్ ఆలెన్ (41) మధ్య ఓవర్లలో ఆకట్టుకున్నాడు. అక్షర్, నబీ, బ్రార్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 26.4 ఓవర్లలో 89 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ (27), నమన్ (21), అక్షర్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా హెన్రీ నిలిచాడు.
సున్నాకే మూడు వికెట్లు: ఛేదనలో భారత్ ఆటతీరు న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా సాగింది. పిచ్ అంత ప్రమాదకరంగా కనిపించకపోయినా.. ఫ్లడ్‌లైట్ల వెలుతురు కారణంగా బంతిలో కాస్త బౌన్స్, మూమెంట్ కనిపించింది. దీన్ని హెన్రీ చక్కగా వినియోగించుకొంటూ.. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ (0)ను, ఆ తర్వాత ఐదు, ఆరు బంతులకు వరుసగా విరాట్ కోహ్లీ (0), శ్రేయాస్ అయ్యర్(0)లను డకౌట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. ఇలా.. ఆరు బంతుల్లోనే 0/3 స్కోరుబోర్డుతో మ్యాచ్ ఫలితం ఏమిటో తెలిసొచ్చింది. ఇక ఆరో ఓవర్‌లో ఓపెనర్ రుతురాజ్ (5)ను జేమిసన్ అవుట్ చేశాడు. కాగా, తర్వాతి బంతికే అక్షర్ ఇచ్చిన క్యాచ్‌ను కెల్లీ వదిలేశాడు. 9/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన జట్టును ఇషాన్-అక్షర్ జోడీ కాసేపు ఆదుకుంది. అయినా పది ఓవర్లలో భారత్ చేసింది 26 పరుగులే. ఐదో వికెట్‌కు అడపాదడపా ఫోర్లతో 44 రన్స్ జోడించాక అక్షర్‌ను ఫిషర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత హెన్రీ, ఫిషర్ వరుసగా వికెట్లు తీస్తూ జట్టును వంద పరుగుల్లోపే కట్టడి చేశారు.
ఓపెనర్ల హవా: కివీస్‌కు ఓపెనర్లు యంగ్, సైఫర్ట్ శుభారంభం అందించారు. అయితే రెండో ఓవర్‌లోనే యంగ్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను రోహిత్, ఇషాన్ వదిలేయడంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అప్పటికి అతను ఐదు పరుగుల మీదే ఉన్నాడు. ఆరంభంలో సైఫర్ట్ వేగం చూపి 39 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. దీంతో పది ఓవర్లలోనే జట్టు 72 రన్స్‌తో నిలిచింది. 12వ ఓవర్‌లో సైఫర్ట్ వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యంగ్ బాధ్యత తీసుకున్నాడు. ఆలెన్‌తో నాలుగో వికెట్‌కు 90, బ్రేస్‌వెల్ (15)తో ఐదో వికెట్‌కు 41 రన్స్ జోడించాడు. ఇక, 32వ ఓవర్‌లో శతకాన్ని పూర్తి చేసుకున్న యంగ్.. కాసేపటికి నమన్‌కు చిక్కాడు. అనంతరం చివరి 10 ఓవర్లలో 68 పరుగులే చేసినప్పటికీ కివీస్ 330+ స్కోరు దాటగలిగింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: యంగ్ (సి సబ్) కుషాగ్ర (బి) నమన్ 125, సైఫర్ట్ (సి) ఇషాన్ (బి) బ్రార్ 58, కెల్లీ (స్టంప్) ఇషాన్ (బి) అక్షర్ 4, ఫాక్స్‌క్రాఫ్ట్ (సి) బ్రార్ (బి) నబీ 8, ఆలెన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 41, బ్రేస్‌వెల్ (సి) నమన్ (బి) బ్రార్ 15, శాంట్నర్ (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 24, క్లార్క్ (ఎల్బీ) నబీ 22, జేమిసన్ (నాటౌట్) 19, హెన్రీ (రనౌట్) 2, ఫిషర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 50 ఓవర్లలో 333 ఆలౌట్. వికెట్ల పతనం: 1-85, 2-96, 3-125, 4-215, 5-256, 6-258, 7-293, 8-318, 9-332, 10-333. బౌలింగ్: అర్ష్‌దీప్ 10-0-55-1, నబీ 8-0-59-2, బ్రార్ 10-0-69-2, అక్షర్ 10-0-39-2, కుల్దీప్ 8-0-73-0, నమన్ 4-0-29-1.
భారత్: రోహిత్ (సి) ఆలెన్ (బి) హెన్రీ 0, రుతురాజ్ (సి) బ్రేస్‌వెల్ (బి) జేమిసన్ 5, విరాట్ (బి) హెన్రీ 0, శ్రేయాస్ (ఎల్బీ) హెన్రీ 0, ఇషాన్ (బి) హెన్రీ 27, అక్షర్ (సి) ఆలెన్ (బి) ఫిషర్ 21, నమన్ (సి) శాంట్నర్ (బి) ఫిషర్ 21, నబీ (సి) సైఫర్ట్ (బి) షిఫర్ 5, కుల్దీప్ (బి) హెన్రీ 1, బ్రార్ (బి) హెన్రీ 2, అర్ష్‌దీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 26.4 ఓవర్లలో 89 ఆలౌట్. వికెట్ల పతనం: 1-0, 2-0, 3-0, 4-9, 5-53, 6-61, 7-66, 8-69, 9-83, 10-89. బౌలింగ్: హెన్రీ 9.4-2-27-6, జేమిసన్ 6-2-12-1, క్లార్క్ 2-0-13-0, ఫిషర్ 7-1-31-3, బ్రేస్‌వెల్ 2-0-6-0.
వన్డేల్లో భారత్ తరఫున ఎక్కువసార్లు (20) డకౌట్ అయిన బ్యాటర్‌గా సచిన్‌ను సమం చేసిన విరాట్ కోహ్లీ.
వన్డేల్లో సున్నాకే 3 వికెట్లు కోల్పోవడం భారత్‌కు ఇదే తొలిసారి. గతంలో పాకిస్థాన్ కూడా ఈ చెత్త రికార్డు చేసింది.
వన్డే ఫార్మాట్‌లో భారత్‌కిది రెండో (244 రన్స్ తేడాతో) భారీ ఓటమి. గతంలో శ్రీలంక చేతిలో 245 పరుగులతో ఓడింది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!