పట్టేస్తారా సిరీస్?
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:03 AM
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ఇప్పటిదాకా పూర్తి ఓవర్లపాటు వినోదం పంచలేకపోయింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ 63 ఓవర్లు, రెండో వన్డే 67 ఓవర్లు మాత్రమే జరిగాయి...
ఉదయం 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
ఆత్మవిశ్వాసంతో టీమిండియా
న్యూజిలాండ్‌కు చావోరేవో
నేడు మూడో వన్డే
హామిల్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ఇప్పటిదాకా పూర్తి ఓవర్లపాటు వినోదం పంచలేకపోయింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ 63 ఓవర్లు, రెండో వన్డే 67 ఓవర్లు మాత్రమే జరిగాయి. అయినా టీమిండియా తమకు దక్కిన సమయంలోనే అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధించి 2-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇక మంగళవారం ఇరు జట్ల మధ్య కీలక మూడో వన్డేకు స్థానిక సెడాన్ పార్క్ వేదిక కానుంది. గిల్ సేన సిరీస్ దక్కించుకునేందుకు ఈ మ్యాచ్‌లో నెగ్గితే సరిపోతుంది. అటు ఆతిథ్య కివీస్‌కు మాత్రం చావోరేవో పరిస్థితి నెలకొంది. స్వదేశంలో వరుసగా 11 వన్డే సిరీస్‌లతో జోరు మీదున్న ఈ జట్టుకు భారత్ బ్రేక్ వేసేలా ఉంది. చివరిసారి 2019లో కూడా భారత్ చేతిలోనే సిరీస్ ఓడడం గమనార్హం. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న శాంట్నర్ సేన కచ్చితంగా మ్యాచ్ గెలిచి సిరీస్‌లో సజీవంగా ఉండాలనుకుంటోంది. భారత పేసర్ల ధాటికి బ్యాటర్లు తడబడుతుండగా.. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం జట్టుకు సమస్యగా మారింది. ఇన్ని బలహీనతలను అధిగమించి ప్రత్యర్థిని ఏమేరకు నిలువరించగలదో వేచిచూడాల్సిందే. హామిల్టన్ మైదానంలో భారత్ ఆడిన 12 వన్డేల్లో మూడు మాత్రమే నెగ్గి, 8 ఓడింది. ఒకదాంట్లో ఫలితం రాలేదు.
బ్యాటర్లూ మెరవాలి..: భారత్ ఈ సిరీస్‌లో సాధించిన రెండు విజయాల్లో పేసర్ల పాత్రే కీలకంగా నిలవగా, బ్యాటింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో విరాట్, గిల్ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఇక రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. అటు గోల్డెన్ డకౌటైన గిల్‌కు ఈ సిరీస్‌లో ఇదే చివరి మ్యాచ్ కానుంది. టెస్టులకు సన్నాహకంగా తను మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న పేసర్లకు సెడాన్ పార్క్ వికెట్ కూడా అనుకూలంగా ఉండనుంది. దీంతో బ్రార్, అర్ష్‌దీప్, అన్షుల్, నబీ మరోసారి జట్టు విజయానికి అండగా నిలిచే అవకాశం ఉంది. తుది జట్టులో మార్పులకు చాన్స్ లేకపోవడంతో పేసర్ సిరాజ్ బెంచీకే పరిమితం కానున్నాడు.
గాయాల బెడదతో..: ఓవైపు ఓటములు.. మరోవైపు ఆటగాళ్ల గాయాలు కివీస్‌ను వెనక్కి లాగుతున్నాయి. తాజాగా పేసర్ టిక్నెర్, ఫెర్గూసన్ సిరీ్‌సకు దూరమయ్యారు. మ్యాట్ హెన్రీ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కూ అందుబాటులో ఉండడు. మరోవైపు సొంత గడ్డపై కివీస్ బ్యాటర్లకు పరుగులు తీయడం సవాల్‌గా మారింది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, గిల్ (కెప్టెన్), విరాట్, శ్రేయాస్, అక్షర్, రాహుల్, నమన్, అన్షుల్, నబీ, బ్రార్, అర్ష్‌దీప్. న్యూజిలాండ్: యంగ్, సైఫర్ట్, నికోల్స్, మిచెల్, ఫిలిప్స్, లాథమ్, శాంట్నర్ (కెప్టెన్), స్మిత్, జేమిసన్, ఫిషర్, డఫీ.
ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు
ఐదు వన్డేల సిరీస్‌ను వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లకు వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతినే ఫలితాలు వచ్చాయి. తాజాగా మంగళవారం నాటి వన్డేపైనా వర్ష ప్రభావం పడనుంది. సోమవారం భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సమయంలో వర్షం రావడంతో అవుట్ డోర్ నుంచి ఇండోర్‌కు మారాల్సి వచ్చింది. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో టాస్ ఆలస్యం కావడంతో పాటు మ్యాచ్ కూడా సజావుగా సాగకపోవచ్చు. పిచ్ ఎప్పటిలాగే పేసర్లకు అనుకూలించనుంది.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్