Share News

గిల్‌ సేనకు అసలైన సవాల్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:37 AM

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన టెస్ట్‌ సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో....

గిల్‌ సేనకు అసలైన సవాల్‌

తెల్లవారుజామున 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి టెస్ట్‌ నేటి నుంచి

వెల్లింగ్టన్‌: వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన టెస్ట్‌ సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ గురువారం ఆరంభం కానుంది. ఎంతో కీలకమైన టెస్ట్‌ కావడంతో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వ్యూహాలు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనే దానిపై అందరి దృష్టీ నెలకొంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో కివీస్‌ టాప్‌లో ఉండగా.. భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టాప్‌-2లో నిలవాలంటే టీమిండియా ఈ సైకిల్‌లో మిగిలిన ఏడు టెస్ట్‌ల్లో కనీసం ఆరు గెలవాల్సిన పరిస్థితి. కాగా, వెల్లింగ్టన్‌ హోరు గాలులు బ్యాటర్లు, బౌలర్లకు కఠిన సవాల్‌ విసరనున్నాయి. ఈ క్రమంలో నిప్పులు చెరుగుతున్న కివీస్‌ పేస్‌ దళాన్ని ఎదుర్కొనేందుకు గిల్‌తోపాటు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రిషభ్‌ పంత్‌ ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది. పచ్చికతో కూడిన వికెట్‌ తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలించే చాన్సులుండడంతో.. టాస్‌ గెలిస్తే గిల్‌ ఎటువంటి ఆలోచనా లేకుండా బౌలింగ్‌ ఎంచుకోవచ్చు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతామని టీమిండియా కెప్టెన్‌ చూచాయగా చెప్పిన నేపథ్యంలో బుమ్రా, సిరాజ్‌తోపాటు పిచ్‌పై బౌన్స్‌ రాబట్టగలిగే పొడగరి అయిన బౌలర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ లేదా గుర్నూర్‌ బ్రార్‌లలో ఒకరికి తుదిజట్టులో ఆడే అవకాశం రావచ్చు. కోచ్‌ నమ్మకాన్ని చూరగొన్న అన్షుల్‌ కాంబోజ్‌ను నాలుగో బౌలర్‌గా ఎంపిక చేస్తే.. నితీశ్‌ కుమార్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

బలంగా కివీస్‌..: న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి టెస్ట్‌లో ఓడినా ఆ తర్వాత పుంజుకొని 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకొంది. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నా.. యంగ్‌, మిచెల్‌, ఫిలిప్స్‌ బ్యాటింగ్‌కు అండగా నిలుస్తున్నారు. కోలుకొన్న రచిన్‌ రవీంద్ర మళ్లీ జట్టులోకి రావడంతో సమతుల్యత పెరిగింది. జేమిసన్‌, మాట్‌ హెన్రీ, డఫీతో బౌలింగ్‌ బలంగా కనిపిస్తోంది. అయితే, టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన జోష్‌లో ఉన్న భారత్‌.. టెస్ట్‌ సిరీస్‌లో కూడా సత్తా చాటాలనుకొంటోంది.


న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ 25 టెస్టుల్లో తలపడగా.. ఐదింటిలో మాత్రమే గెలిచింది. పదింటిలో కివీస్‌ నెగ్గగా.. 9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఒక టెస్టు వర్షంతో రద్దయింది. భారత్‌ చివరిసారిగా ఇక్కడ 2009లో గెలుపొందింది.

జట్లు (అంచనా)

భారత్‌: యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, పడిక్కల్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌, జడేజా, నితీశ్‌/అన్షుల్‌/ఆకాష్‌ దీప్‌, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ/గుర్నూర్‌.

న్యూజిలాండ్‌: టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), డెవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), ఫిలిప్స్‌, నాథన్‌ స్మిత్‌, జేమిసన్‌, హెన్రీ, డఫీ/టిక్నర్‌.

పిచ్‌/వాతావరణం

వికెట్‌పై పచ్చిక ఎక్కువగా ఉండడంతో పేసర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు రోజులపాటు పిచ్‌లో జీవం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ చేయడానికి మొగ్గుచూపే చాన్సులున్నాయి. కాగా, బలంగా గాలులు వీచే నగరాల్లో వెల్లింగ్టన్‌ ఒకటి. ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పవనాలు వీచే అవకాశం ఉండడంతో.. ఓ ఎండ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇక, వాతావరణం పొడిగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 04:37 AM