అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్‌కి దూసుకెళ్లిన యువ భారత్
ABN , Publish Date - Feb 04 , 2026 | 08:28 PM
అండర్-19 వన్డే ప్రపంచ కప్-2026లో ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 వన్డే ప్రపంచ కప్ (U19 World Cup-2026)లో ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అరోన్ జార్జి (115) సెంచరీతో చెలరేగాడు. మరోఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)(68; 33 బంతులు) విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే (62), విహాన్ మల్హోత్రా (38*) రాణించారు. శుక్రవారం (ఫిబ్రవరి 6) జరగనున్న ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. సెమీ ఫైనల్-1లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్(Afghanistan) బ్యాటర్లలో ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా (101*) సెంచరీలు బాదారు. షినోజాదా, ఉజైరుల్లా మూడో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం (130 బంతుల్లో) నెలకొల్పారు. ఓపెనర్లు ఉస్మాన్ సాదత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) ఫర్వాలేదనిపించారు. అఫ్గాన్ చివరి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అంబరీష్ వేసిన 44 ఓవర్లో ఉజైరుల్లా వరుసగా 6, 4, 4, 4 బాదేశాడు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేశ్ దేవేంద్రన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భారీ టార్గెట్ ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఈ ఐసీసీ టోర్నీలో ఆది నుంచి యువ భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇదే దూకుడు ఫైనల్ వరకు కంటిన్యూ చేస్తే.. విశ్వ విజేతగా యువ భారత్ నిలవడం ఖాయం.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ