కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:47 AM
వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37) సంచలన నిర్ణయం తీసుకొంది. భారత మహిళల జట్టు అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు..
ఇకపై ప్లేయర్‌గానే ప్రయాణం
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37) సంచలన నిర్ణయం తీసుకొంది. భారత మహిళల జట్టు అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు మంగళవారం సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే, ప్లేయర్‌గా మాత్రం కొనసాగుతానని తెలిపింది.
తప్పించారా..?
వాస్తవంగా 2028 లాస్ ఏంజిల్స్ వరకు కెప్టెన్‌గా కొనసాగాలని హర్మన్ భావించింది. అయితే, ఇటీవలి కాలంలో జట్టు ప్రదర్శన, కెప్టెన్సీ మార్పు ప్రధాన అజెండాగా సోమవారం గువాహటిలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాతోపాటు హర్మన్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కోచ్ అమోల్ మజుందార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగడానికి ఆసక్తిని వ్యక్తం చేసినా.. జట్టు భవిష్యత్ రీత్యా మొత్తంగా తప్పుకోవాలని హర్మన్‌కు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత మహిళల జట్టు కొత్త సారథిగా స్మృతి మంధానను నియమిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అయితే, సారథ్య మార్పు నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకొన్నది కాదని సమాచారం. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ నాకౌట్ చేరడంలో విఫలమైంది. అలాగే బ్యాటర్‌గా కూడా కౌర్ ఆకట్టుకోలేకపోతోంది. దీంతో అప్పటినుంచే హర్మన్‌ను తప్పించి స్మృతి మంధానకు జట్టు బాధ్యతలు అప్పగించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆసియాకప్, ఆసియా క్రీడల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టినా.. హర్మన్‌పై వేటు తప్పలేదు. మరోవైపు జట్టు పగ్గాలు అందుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు మంధాన కూడా కొన్ని రోజులుగా సంకేతాలిస్తోంది.
సొంతగడ్డపై వరల్డ్‌కప్ విజేతగా..
హర్మన్ దశాబ్దంపాటు టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించింది. 2012లో తొలిసారి తాత్కాలిక టీ20 టీమ్ సారథిగా బాధ్యతలు చేపట్టింది. అనంతరం 2016 నుంచి పొట్టి ఫార్మాట్‌లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకొంది. 2022లో వన్డే టీమ్ పగ్గాలు అందుకొన్న హర్మన్.. 2023 నుంచి అన్ని ఫార్మాట్లలోనూ జట్టును నడిపించింది. 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20ల్లో హర్మన్ జట్టుకు సారథ్యం వహించింది. గతేడాది నవంబరులో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి హర్మన్ సేన విశ్వవిజేతగా నిలిచింది.
నా బాధ్యత ముగిసింది..
‘కెప్టెన్‌గా నా బాధ్యత ముగిసింది. అన్ని ఫార్మాట్ల సారథ్యం నుంచి తప్పుకొంటున్నా. జట్టు కోసం నా సర్వశక్తులూ ధారపోశా. వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకొన్నా.. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించా. కొన్నిసార్లు సారథిగా కఠిన నిర్ణయాలు తీసుకొన్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా.. జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకొన్నా. భారత మహిళల జట్టుకు నాయకత్వం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. కెప్టెన్సీ పూర్తయినా.. క్రికెటర్‌గా ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది’
హర్మన్‌ప్రీత్ కౌర్
సెలెక్షన్ కమిటీ పోస్టు కోసం..
దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: అజిత్ అగార్కర్ తప్పుకోవడంతో.. సెలెక్షన్ కమిటీలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిం ది. ఈ మేరకు మంగళవారం తమ వెబ్‌సైట్‌లో ప్రకటనను ఉంచింది. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పదవీ కాలం ఈ నెల 4న ముగిసింది. అయితే, తన కాంట్రాక్ట్‌ను పొడిగించవద్దని అతడు కోరాడు. ఐదుగురు సభ్యుల సెలెక్షన్ ప్యానల్‌లో టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. శివసుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్ మిగతా సభ్యులు. దరఖాస్తుకు ఈ నెల 14 చివరి రోజు. 24 టెస్టులు ఆడిన ఓఝాను చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, పార్థివ్ పటేల్ కూడా పోటీ పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే 25 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న పార్థివ్.. ఓఝాకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన