Share News

ముంబైకి హార్దిక్‌ గుడ్‌బై రూ.18 కోట్లకు పంజాబ్‌కు

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:21 AM

ఐపీఎల్‌ చరిత్రలోనే భారీ ట్రేడ్‌ డీల్‌ ముగిసింది. గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ల పరస్పర బదలాయింపు అధికారికమైంది. ముంబై ఇండియన్స్‌...

ముంబైకి హార్దిక్‌ గుడ్‌బై రూ.18 కోట్లకు పంజాబ్‌కు

రూ.18 కోట్లకు పంజాబ్‌కు

  • బదులుగా అర్ష్‌దీప్‌ను అమ్మేసిన కింగ్స్‌

  • ఐపీఎల్‌లో భారీ ట్రేడ్‌ డీల్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలోనే భారీ ట్రేడ్‌ డీల్‌ ముగిసింది. గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ల పరస్పర బదలాయింపు అధికారికమైంది. ముంబై ఇండియన్స్‌ నుంచి రూ. 18 కోట్లకు పాండ్యాను కొనుగోలు చేసిన పంజాబ్‌.. బదులుగా అర్ష్‌దీప్‌ను అతడి ప్రస్తుత ధర రూ. 18 కోట్లకు ముంబైకి అమ్మేసినట్టు ఐపీఎల్‌ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. హార్దిక్‌ ప్రస్తుత ధర రూ. 16.35 కోట్లు కాగా.. కింగ్స్‌ రూ. 1.65 కోట్లు అదనంగా వెచ్చించిమరీ తీసుకోవడం విశేషం. ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 18 కోట్లకు రాజస్థాన్‌ నుంచి కొనుగోలు చేయగా.. బదులుగా జడేజాను రూ. 14 కోట్లకు, సామ్‌ కర్రాన్‌ను రూ. 2.4 కోట్లకు అమ్మేసింది. నిబంధనల ప్రకారం పాండ్యాకు అధికంగా లభించిన రూ. 1.65 కోట్లలో సగం ముంబై ఫ్రాంచైజీకి, సగం ఆటగాడికి దక్కుతుంది. తొలి విడతలో ముంబై తరఫున ఏడు సీజన్లపాటు ఆడిన హార్దిక్‌ను 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 15 కోట్లకు కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగించింది. అరంగేట్రంలోనే గుజరాత్‌ను విజేతగా నిలిపిన పాండ్యా.. 2023లో మరోసారి ఫైనల్‌ చేర్చాడు. అయితే, 2024లో భారీ డీల్‌తో మళ్లీ ముంబైకి తిరిగి వచ్చాడు. కానీ, ఈ పర్యాయం అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్‌ను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం బెడిసి కొట్టింది. 2025లో ముంబై ప్రదర్శన ఫర్వాలేదనిపించినా.. 2026లో పేలవంగా సాగింది. సీనియర్లతో ఇమడలేని పరిస్థితుల్లో పాండ్యా ముంబైను వీడతాడనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. తొలుత చెన్నై, ఆ తర్వాత రాజస్థాన్‌కు వెళతాడనే ఊహాగానాలు వెలువడినా.. ఎట్టకేలకు పంజాబ్‌ అతడిని సొంతం చేసుకొంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో హార్దిక్‌ పాండ్యా ఆడనున్నాడు.

పాండ్యాకు శుభం జరగాలని కోరుకొంటున్నా

హార్దిక్‌ పాండ్యాకు భవిష్యత్‌లో అంతా మంచే జరగాలని కోరుకొంటున్నా. వ్యక్తిగా, ఆటగాడిగా అతడంటే ఎంతో గౌరవం. హార్దిక్‌తో ఎన్నో అమూల్యమైన జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. క్రికెటర్‌గా పాండ్యా ఎదుగుదలను చూశాం. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన హార్దిక్‌ మళ్లీ తిరిగి వచ్చి ముంబైను నడిపించాడు.

ఆకాశ్‌ అంబానీ

ముంబై ఫ్రాంచైజీ యజమాని

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 06:21 AM