Share News

ఢిల్లీ.. వచ్చిందిమళ్లీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:56 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. బౌలర్లకు తోడు టాపార్డర్‌ చెలరేగడంతో వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది...

ఢిల్లీ.. వచ్చిందిమళ్లీ

బెంగళూరుతో అమీతుమీ రేపు

  • వరుసగా నాలుగోసారి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌కు

  • చెలరేగిన లీ, జెమీమా

  • ఎలిమినేటర్‌లో గుజరాత్‌ ఓటమి

వడోదర: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. బౌలర్లకు తోడు టాపార్డర్‌ చెలరేగడంతో వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇక గురువారం జరిగే ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (51 బంతుల్లో 6 ఫోర్లతో 62 నాటౌట్‌), వేర్‌హమ్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. హెన్రీకి 3, నందనకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 15.4 ఓవర్లలోనే 169/3 స్కోరు చేసి గెలిచింది. లిజెల్లే లీ (24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), లారా వోల్వార్ట్‌ (24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్‌), షఫాలీ (21 బంతుల్లో 7 ఫోర్లతో 31) వేగంగా ఆడారు. వేర్‌హమ్‌కు 2 వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా జెమీమా నిలిచింది.

ఎదురుదాడితో ఆరంభం: ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు లిజెల్లే లీ, షఫాలీ ఆరంభం నుంచే కదం తొక్కారు. బంతి పడడమే ఆలస్యం భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మూడు, నాలుగో ఓవర్లలో షఫాలీ మూడేసి ఫోర్లు బాదగా.. అటు లీ ఐదో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగింది. షఫాలీ సైతం రెండు ఫోర్లు సాధించగా, పేసర్‌ రేణుక 21 పరుగులిచ్చుకుంది. ఆరో ఓవర్‌లో లీ 6,4తో ఢిల్లీ పవర్‌ప్లేలో 75 పరుగులతో నిలిచింది. కానీ ఎనిమిదో ఓవర్‌లో ఓపెనర్లను పేసర్‌ వేర్‌హమ్‌ పెవిలియన్‌ చేర్చడంతో తొలి వికెట్‌కు 42 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కాస్త ఆచితూచి ఆడిన జెమీమా, వోల్వార్ట్‌ బ్యాట్లకు పనిజెప్పడంతో తిరిగి స్కోరు దూసుకెళ్లింది. మూడో వికెట్‌కు ఈ జోడీ 68 రన్స్‌ జోడించగా.. మరో 26 బంతులుండగానే మారిజానె కాప్‌ (4 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించింది.


ఆదుకున్న మూనీ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ బెత్‌ మూనీ కీలక ఆటతీరును ప్రదర్శించింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో గుజరాత్‌ 38 పరుగులకే డివైన్‌ (6), అనుష్క (16), గార్డ్‌నర్‌ (0)ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మూనీకి వేర్‌హహ్‌ జత కలవడంతో కాసేపు వికెట్ల పతనం ఆగింది. ఇద్దరూ సమన్వయంతో ఆడి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఐదో వికెట్‌కు 61 పరుగులు జత చేరాక 17వ ఓవర్‌లో వేర్‌హమ్‌తో పాటు భారతి (0) వికెట్లను హెన్రీ పడగొట్టింది. ఆ తర్వాత కష్వీ (18)తో కలిసి మూనీ వేగం కనబర్చడంతో చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు రావడంతో స్కోరు కూడా 160 దాటింది. అటు మూనీ 47 బంతుల్లో అజేయంగా ఫిఫ్టీ పూర్తి చేసింది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌: 20 ఓవర్లలో 168/7. (బెత్‌ మూనీ 62 నాటౌట్‌, వేర్‌హమ్‌ 35; హెన్రీ 3/35, నందని 2/44).

ఢిల్లీ: 15.4 ఓవర్లలో 169/3 (లిజెల్లె లీ 43, జెమీమా 41, వోల్వార్ట్‌ 32 నాటౌట్‌, షఫాలీ 31, వేర్‌హమ్‌ 2/28).

ఇవి కూడా చదవండి:

అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

Updated Date - Feb 04 , 2026 | 05:56 AM