Share News

అథ్లెట్ల అగచాట్లు.. సాయానికి ఎన్నారైలు!

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:08 AM

నగోయలో ఆసియా క్రీడలకు వచ్చిన భారత అథ్లెట్లకు వసతి, రవాణా సమస్యలు ఎదురయ్యాయి. సంక్షోభ సమయంలో సాయం చేసేందుకు జపాన్‌లోని ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. గదుల కొరతతో 35 మందికి పైగా అథ్లెట్లను ప్రైవేట్‌ హోటళ్లకు తరలించగా, జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ గది కేటాయింపుపై వివాదం నెలకొంది.

అథ్లెట్ల అగచాట్లు..  సాయానికి ఎన్నారైలు!
Asian Games 2026 accommodation issues

  • భారత క్రీడాకారుల వసతి సమస్యల నివారణకు క్రీడాశాఖ ప్రత్యేక చర్యలు

నగోయ: ఆసియా క్రీడల ఆరంభానికి ముందే నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతుల కొరత, శిక్షణకు అంతరాయం వంటి సమస్యలతో భారత్‌తో పాటు మిగతా దేశాల అథ్లెట్లు సతమతమవుతున్నారు. క్రీడల కోసం ఇక్కడ అడుగుపెట్టిన తొలిరోజే మనూ భాకర్‌, ఇషా సింగ్‌లతో కూడిన భారత షూటర్ల బృందం రవాణా సౌకర్యం ఆలస్యం కారణంగా చాలాసేపు వీధుల్లోనే నిరీక్షించాల్సి వచ్చింది. బ్యాడ్మింటన్‌ బృందానికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈసారి నిర్వాహకులు అథ్లెట్ల విలేజ్‌ను నిర్మించలేదు.


బదులుగా కంటైనర్‌ తరహాలో ఇళ్లు, హోటళ్లు, క్రూయిజ్‌షి్‌పలో వసతిని ఏర్పాటు చేశారు. అయితే, అథ్లెట్ల సంఖ్య పెరగడం, అధికారుల సమన్వయ లోపం కారణంగా తీవ్రమైన గదుల కొరత ఏర్పడింది. దీంతో ఈ సంక్షోభాన్ని నివారించేందుకు భారత క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రణాళికను ఎంచుకుంది. అత్యవసర సమయాల్లో భారత అథ్లెట్లు, అధికారులకు ఆశ్రయం కల్పించేందుకు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా నగోయ నగరంలోని దాదాపు 2 వేల మంది ప్రవాస భారతీయుల (ఎన్నారైలు) సాయం కోరింది. వెంటనే స్పందించిన అక్కడి భారతీయులు అవసరమైతే తమ ఇళ్లలో వసతి ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, గదుల కొరత కారణంగా ప్రస్తుతానికి 35 మందికి పైగా అథ్లెట్లను ప్రైవేట్‌ హోటళ్లకు తరలించినట్టు భారత బృందం చెఫ్‌ డి మిషన్‌ సహదేవ్‌ యాదవ్‌ వెల్లడించారు.


మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గదా..?

మరోవైపు భారత మహిళా జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, ఆమె కోచ్‌ అశోక్‌ మిశ్రాకు ఒకే గదిని కేటాయించడం వివాదాస్పదమైంది. క్రూయిజ్‌ షిప్‌లో ఈ ఇద్దరికీ ఒకే గదిలో ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు సమాచారమిచ్చారు. దీంతో మహిళ, పురుషుడికి కలిపి ఒకే గదిని ఎలా కేటాయిస్తారంటూ నిలదీయడంతో తప్పు తెలుసుకున్న నిర్వాహకులు నాలుగైదు గంటల తర్వాత గానీ సమస్యను పరిష్కరించలేకపోయారని భారత అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

‘ఆసియా’ను గెలవాలని..
ఆసియా గేమ్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

Updated Date - Sep 19 , 2026 | 02:08 AM