Share News

‘ఆసియా’ను గెలవాలని..

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:50 AM

జపాన్‌లో 20వ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. 501 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్‌ గతంలో సాధించిన 107 పతకాల రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్‌, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, హాకీ, బాక్సింగ్‌, ఆర్చరీ, కబడ్డీలో భారత్‌ పతకాలపై భారీ ఆశలు పెట్టుకుంది.

‘ఆసియా’ను గెలవాలని..
Asian Games 2026

  • నేటి నుంచే ఆసియా క్రీడలు

  • 16 రోజుల పండుగకు జపాన్‌ ఆతిథ్యం

  • 46 దేశాలు, 11 వేలమంది అథ్లెట్లు

  • 501 మందితో భారత బృందం సిద్ధం

ఒలింపిక్స్‌ తర్వాత ఆస్థాయి క్రీడోత్సవమైన ఆసియాడ్‌కు వేళైంది.. 20వ ఆసియా క్రీడలకు శనివారం జపాన్‌లో తెరలేవనుంది. అక్టోబరు నాలుగు వరకు జరిగే ఈ మెగా క్రీడా సమరంలో 46 దేశాల నుంచి 11 వేలమందికిపైగా అథ్లెట్లు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు..43 క్రీడాంశాలు, 71 విభాగాలలో కలిపి 469 పతకాలకు పోటీ పడుతున్నారు.. 54 వేదికలలో క్రీడలు జరగనున్నాయి.. ఇక 501 మంది అథ్లెట్లతో భారత్‌ బరిలోకి దిగుతోంది.. గత ఆసియాడ్‌లో 107 (28-38-41) పతకాలతో సాధించిన నాలుగో స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా మన క్రీడాకారులు సై అంటున్నారు.. తద్వారా ఆసియాలో బలమైన క్రీడా శక్తిగా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.

నగోయ (జపాన్‌): నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడలు మరి కొద్ది గంటలలో మొదలు కానున్నాయి. 16 రోజుల ఆటల పండుగలో అలరించేందుకు ఆసియా అత్యుత్తమ అథ్లెట్లు సమాయత్తమయ్యారు. భారీ లక్ష్యాలతో ఇక్కడికి చేరుకున్న భారత బృందానికి ఆదిలోనే ఇక్కట్లు ఎదురయ్యాయి. వసతికోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. గదులు లభించినా..అవి ఇరుకుగా, సౌకర్యాలు తక్కువగా ఉండడంతో వాటిల్లోనే సర్దుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఆరంభ ఆటంకాలను అధిగమించి అసలు యుద్ధంలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.


ఆ రికార్డు బద్దలు కొట్టాలి..: హాంగ్జౌ ఆసియాడ్‌లో 107 పతకాల రికార్డు భారత అథ్లెట్లలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపింది. ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ పోటీలలో మనోళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ఈనేపథ్యంలో విశ్వ క్రీడా వేదికపై 2036 నాటికి టాప్‌-10లోకి ప్రవేశించడం, 2047కి టాప్‌-5లోకి దూసుకురావడం..క్రీడా శాఖ ధ్యేయంగా పెట్టుకుంది. ఈక్రమంలో ఈ ఆసియాడ్‌ భారత్‌కు పరీక్ష కానుంది. ట్రాక్‌ ఫీల్డ్‌, షూటింగ్‌లో భారత్‌ అత్యధిక పతకాలు ఆశిస్తోంది. రెండు ఒలింపిక్‌ పతకాల విజేత మనూ భాకర్‌ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులు, యువకులతో కూడిన 30 మంది షూటర్ల జట్టు అంచనాలను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. రెండుసార్లు ఆసియా క్రీడల చాంపియన్‌, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయంతో ఈసారి దూరం కావడం మనకు ఎదురు దెబ్బ.


అయితే 74 మంది అథ్లెటిక్స్‌ బృందంలో మురళీ శ్రీశంకర్‌, గుల్వీర్‌ సింగ్‌, తజిందర్‌పాల్‌, రోహిత్‌ యాదవ్‌, తేజశ్విన్‌ శంకర్‌, సర్వేశ్‌ కుషారె, తెలుగుతేజం జ్యోతి యర్రాజి, ప్రవీణ్‌ చిత్రవేల్‌ వంటి హేమాహేమీలకు కొదవలేదు. వీరంతా సత్తా చాటితే ట్రాక్‌, ఫీల్డ్‌లో పతక లక్ష్యాలను చేరుకోవడం సులువే. భారత పురుషులు, మహిళల జట్లు క్రికెట్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రెండు జట్లు స్వర్ణాలను దక్కించుకోవడం దాదాపు ఖాయమే. స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్‌/చిరాగ్‌తో కూడిన బ్యాడ్మింటన్‌ జట్టు నుంచి పెద్ద సంఖ్యలో పతకాలు ఆశిస్తున్నారు. పురుషులు, మహిళల హాకీ జట్ల నుంచీ మెరుగైన ప్రదర్శనను అంచనా వేస్తున్నారు. అలాగే బాక్సింగ్‌, ఆర్చరీ, కబడ్డీ జట్లు పతకాల వేటలో ముందుంటాయని భావిస్తున్నారు. మొత్తంగా..మన అథ్లెట్లంతా మెరిస్తే ఈ ఆసియా క్రీడల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోవడం ఖాయం.


పతాకధారులు మను, తజిందర్‌పాల్‌

డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత షూటర్‌ మనూ భాకర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ షాట్‌పుటర్‌ తజిందర్‌ పాల్‌ సింగ్‌ ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా వ్యవహరిస్తారు. ఆరంభ సంబరం స్థానిక పలోమ మిఝుహో స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు జరగనుంది. 158 మంది సభ్యుల భారత బృందం ప్రారంభ వేడుకల్లో పాల్గొంటోంది.


ఇవి కూడా చదవండి:

వయసుతో సంబంధం లేదు.. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే: గంభీర్

ఆసియా గేమ్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

Updated Date - Sep 19 , 2026 | 01:57 AM