మా పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్‌లో 90 శాతం డిస్కౌంట్: శ్రీధర్ వెంబు
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:01 PM
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా నెట్టింట ఒక ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నారు. ఈ పోస్టు జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా నెట్టింట ఒక ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నారు. జోహో సంస్థ పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్ తమకు లైసెన్స్ రెన్యూవల్ ధరలో 90 శాతం డిస్కౌంట్ ఇచ్చినట్టు ఒక కస్టమర్ తనకు చెప్పారని అన్నారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఆ కస్టమర్‌కు ఇటీవల తన మైక్రోసాఫ్ట్ అకౌంట్ రెన్యూయెల్ చేయించుకోవాల్సి వచ్చిందని శ్రీధర్ వెంబు చెప్పారు. అయితే, సంస్థ మాత్రం రెన్యూవల్ ధరను అకస్మాత్తుగా పెంచిందని కస్టమర్ చెప్పారని అన్నారు. దీంతో, ఆ కస్టమర్ జోహో పేరును తెరపైకి తెచ్చారని చెప్పారు. జోహో ఆఫీస్ సూట్ తీసుకునేందుకు ఆలోచిస్తున్నామని ఆ కస్టమర్ చెప్పగానే మైక్రోసాఫ్ట్ తన ధరను అమాంతం తగ్గించేసిందని అన్నారు. ఏకంగా 90 శాతం డిస్కౌంట్ ఇచ్చిందని చెప్పారు. సదరు కస్టమర్ గతంలో జోహో ఉత్పత్తులను వినియోగించారని కూడా చెప్పారు. ఈ విషయాలను ఆ కస్టమర్ స్వయంగా తనతో పంచుకున్నారని అన్నారు.
జోహో ఉత్పత్తులను వాడకపోయినా ఇంత డబ్బు ఆదా అయిందంటూ ఆ కస్టమర్ తనకు ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. అయితే, ఆ కస్టమర్ ఎవరో మాత్రం శ్రీధర్ వెంబు వెల్లడించలేదు. ఏ ఉత్పత్తులకు ఈ డిస్కౌంట్ లభించిందీ, ఏ షరతులు విధించిందనే వివరాలను చెప్పలేదు. ఇకపై మైక్రోసాఫ్ట్ రెన్యూవల్స్ చేసుకోదలిచిన వారు ఇదే టెక్నిక్ ఫాలో కావాలని కూడా శ్రీధర్ వెంబు సరదాగా సూచించారు.
టెక్నాలజీ రంగంలో పోటీ ఆవశ్యకతపై చర్చలో భాగంగా శ్రీధర్ వెంబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏఐ రంగంలో చైనా నుంచి పోటీ పెరుగుతుండటంతో అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తన మోడల్స్‌ను మళ్లీ అన్ని దేశాలకూ అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఇలాంటి ఆరోగ్యకర పోటీ వల్ల గుత్తాధిపత్యానికి అవకాశాలు ఉండవని అన్నారు. అంతిమంగా వినియోగదారులకు లాభం చేకూరుతుందని చెప్పారు. ఆంథ్రోపిక్‌కు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్స్‌ను ఎంపిక చేసిన కొందరికే అందుబాటులో ఉంచాలంటూ ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ విషయంలో ఎందుకు ఈ ఎగతాళి? పోలాండ్ మహిళ అసంతృప్తి
5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..