Bengaluru Metro Moment: బాలిక గొప్ప మనసు.. మెట్రోలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరిగి ఉండదు..
ABN , Publish Date - Jan 16 , 2026 | 01:33 PM
బెంగళూరు మెట్రోలో తాజాగా మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ బాలిక తన బంగారు గాజును యువతికి ఇచ్చేసింది. ఎంతో హుందాగా ప్రవర్తించింది.
బెంగళూరు, జనవరి 16: సాధారణంగా మెట్రో రైళ్లు అంటే గుర్తుకు వచ్చేది రద్దీ, గొడవలు. మెట్రో రైళ్లలో సీట్ల కోసం ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే, బెంగళూరు మెట్రోలో తాజాగా మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ బాలిక తన బంగారు గాజును యువతికి ఇచ్చేసింది. ఎంతో హుందాగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రీతూ జూన్ అనే యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ప్రతి రోజూ ఆఫీస్‌కు మెట్రోలో వెళ్తుంది. నాలుగు రోజుల క్రితం రీతూ మెట్రోలో ప్రయాణిస్తుండగా ఓ బాలిక చేతికి ఉన్న గాజు ఆమె దృష్టిని ఆకర్షించింది.
బాలిక చేతికి ఉన్న బంగారు గాజు యువతికి బాగా నచ్చింది. ‘నీ చేతికి ఉన్న గాజు చాలా అందంగా ఉంది. ఓ ఫొటో తీసుకోవచ్చా. నేను కూడా ఇలాంటి గాజులు చేయించుకుంటాను’ అని బాలికకు చెప్పింది. ఆ బాలిక తన చేతికి ఉన్న గాజును రీతూకు ఇచ్చేసింది. ‘దీన్ని తీసుకెళ్లండి. గోల్డ్‌స్మిత్ మరింత చక్కగా డిజైన్‌ను అర్థం చేసుకుంటాడు’ అని చెప్పింది. రీతూ ఆశ్చర్యపోయింది. బంగారు గాజు అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తోంది అనుకుంది. ఆ బాలిక గాజును రీతూ చేతిలో పెట్టిన తర్వాత ‘ఇది బంగారు గాజు కాదులెండి. కవరింగ్’ అంది. దీంతో రీతూ ఎమోషనల్ అయింది. బాలిక మంచి మనసు చూసి కంటతడి పెట్టుకుంది.
రీతూ బాలిక మంచితనానికి గుర్తుగా గాజును తీసేసుకుంది. తనకు ఎదురైన అద్భుతమైన అనుభవం గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. గాజుకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నిజంగా ఆ బాలిక మనసు చాలా గొప్పది’..‘ఆ బాలికలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా బాలికకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
సంక్రాంతి రిటర్న్ జర్నీకి పోలీసుల ప్రత్యేక చర్యలు