CCTV Video Goes Viral: నడిరోడ్డులో ఎలుగుబంటి.. యువకుల వెంటబడి..
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:02 PM
రిషికేశ్‌లోని శ్యామ్‌పూర్ హాత్ ఏరియాలో ఎలుగుబంటి యువకుల వెంటపడింది. ఆ యువకులు అతి కష్టం మీద ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ ఎలుగుబంటి రోడ్డుపై వెళుతున్న యువకులకు షాక్ ఇచ్చింది. వారి వెంటపడి పరుగులు పెట్టించింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రిషికేశ్‌లోని శ్యామ్‌పూర్ హాత్ ఏరియాలో రాత్రి వేళ ఓ ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళుతున్నారు. వారి వెనకాల ఓ మూడు ఆవులు కూడా ఉన్నాయి. కొంత దూరం వెళ్లగానే ఆ ఆవులు ఆగిపోయాయి. అక్కడినుంచి ముందుకు కదలకుండా చుట్టూ చూడ్డం మొదలెట్టాయి. యువకులు జరగబోయే ప్రమాదం గురించి తెలీక నడుచుకుంటూనే వెళుతున్నారు.
ఉన్నట్టుండి ఓ ఎలుగుబంటి వారికి ఎదురుగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా వారి గుండెలు ఝల్లుమన్నాయి. వెనక్కు తిరిగి చూడకుండా పరుగులు తీయటం మొదలెట్టారు. ఆ యువకులకంటే ముందే ఆవులు అలర్ట్ అయ్యాయి. భయంతో అక్కడినుంచి పారిపోయాయి. ఆ ఎలుగుబంటి యువకుల వెంటపడింది. యువకులు అతి కష్టం మీద ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. ఆ ఎలుగుబంటి ఊరిలో చాలా చోట్ల తిరుగుతూ కనిపించింది. దాని కారణంగా పట్ట పగలు కూడా బయట తిరగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఇక, ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఆ ఎలుగుబంటి రాజాజీ నేషనల్ పార్క్ నుంచి ఆహారం కోసం వెతుకుతూ ఊరిలోకి వచ్చి ఉంటుందని అన్నారు. ఇలాంటి సంఘటనలు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తరచుగా జరుగుతూ ఉంటాయని చెప్పారు. సీజనల్ ఛేంజెస్ జరిగినపుడు ఇలాంటివి తప్పవని తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
‘వికెట్ పల్స్’.. ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ చూశారా..?
జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు.. మంత్రి నారాయణ ఫైర్