ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు రెడ్ కలరే ఎందుకు వేస్తారో తెలుసా...
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:20 PM
మనం రోజూ వంటగదిలో గ్యాస్ సిలిండర్‌ను చూస్తుంటాం. గృహ వినియోగం కోసం వాడే సిలిండర్లు ఎరుపు రంగులోనే ఉంటాయి. ఈ సిలిండర్లకు ఎరుపు రంగునే ఎందుకు వేస్తారంటే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంటి వంట గదిలో గ్యాస్ సిలిండర్ పక్కా ఉంటుందనే చెప్పాలి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ అందుబాటులోకి వచ్చిన తరువాత కట్టెల పొయ్యి అనేది కనుమరుగైంది. ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాల కారణగా దేశంలోని చాలా మంది ప్రజలు వంటలకు గ్యాస్ పొయ్యినే వినియోగిస్తున్నారు. దీంతో వంటలు చేయడం మరింత సులువు కాగా.. పొల్యూషన్ బాధ కూడా తప్పింది.
ఇది ఇలా ఉంటే.. ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఉంటుంది. గ్యాస్ కంపెనీల పేర్లలో మార్పు ఉంటుందేమో కానీ సిలిండర్ రంగులో మాత్రం ఉండదు. మరి గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా శోధించారా? గ్యాస్ సిలిండర్ రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటుందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
ఎల్‌పీజీ సిలిండర్లకు ఎరుపు రంగును ఎందుకు వేస్తారో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇది డిజైన్, గుర్తింపునకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. ఈ రంగు భద్రత, ప్రామాణికరణ, వినియోగ సమస్యలను సూచిస్తుంది. ఎరుపు రంగు దూరం నుంచి ఈజీగా కనిపిస్తుంది. ఈ రంగును ప్రమాద సంకేతంగా కూడా పరిగణిస్తారు. అందుకే ఎల్‌పీజీకి ఎరుపు రంగును వినియోగిస్తారు. వాస్తవానికి ఎరుపు రంగును ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదం లేదా హెచ్చరిక సంకేతంగా ఉపయోగిస్తారు. ఎల్‌పీజీ మండే వాయువు. అందుకే ప్రజలు అలర్ట్‌గా ఉండేలా ఈ ఎరుపు రంగును ఎల్‌పీజీకి వేస్తారు. మనం కూడా ఆ రంగును చూసిన వెంటనే ప్రమాద కారకమని గుర్తిస్తాం. అందుకే అగ్ని ప్రమాద హెచ్చరికలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర హెచ్చరికలు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి. ఎరుపు రంగు ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. ఇది తక్కువ కాంతి, పొగమంచు, పొగలో కూడా ఈజీగా కనిపిస్తుంది.
ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. భద్రతా ప్రమాణాలలో భాగంగా గ్యాస్ కంపెనీలు, నియంత్రణ సంస్థలు ఎరుపు రంగు నిబంధనలను అనుసరిస్తాయి. భారతదేశంలో పెట్రోలియం, గ్యాస్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎల్‌పీజీ సిలిండర్లను ఎరుపు రంగులో పెయింట్ చేస్తారు. ఇక్కడ మరో విషయం మీరు తెలుసుకోవాల్సి ఉంది. అదేంటంటే.. అంతర్జాతీయ భద్రతా ప్రమణాల ప్రకారం.. ఒక్కో వాయువు కలిగిన సిలిండర్‌కు ఒక్కో రంగును ఉపయోగిస్తారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు, ఆక్సిజన్‌కు తెలుపు రంగు, నైట్రోజన్‌కు నలుపు రంగు, కార్బన్ డైయాక్సైడ్‌కు బూడిద రంగును వేస్తారు. మన దేశంలో 1955లో ముంబైలో తొలిసారిగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల వాడకం మొదలైంది.
ఇవి కూడా చదవండి:
అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై పోరాడుతాం: కేటీఆర్
19 మంది భారతీయులను అరెస్ట్ చేసిన యూఏఈ.. ఎందుకంటే..