బైకుతో ట్రైన్‌ను లాగాలని చూసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Apr 16 , 2026 | 09:14 PM
ఓ యువకుడు ప్రాణాలకు తెగించాడు. ఏకంగా తన బైకుతో రైలును లాగడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఎంజీ మోటార్స్ ఇండియాకు చెందిన ఎంజీ మేజస్టర్ కారు మార్కెట్‌లోకి రాకముందే రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీన దాదాపు 400 టన్నుల బరువు ఉండే రైలును 300 అడుగుల వరకు లాగి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటుసంపాదించుకుంది. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి ఓ యువకుడు ప్రాణాలకు తెగించాడు. ఏకంగా తన బైకుతో రైలును లాగడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ట్రైన్స్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ అయింది.
ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి తన బైకును తాడుతో రైలు ఇంజిన్‌కు కట్టేశాడు. బైక్ స్టార్ట్ చేసి రైలును ఆ తాడు సాయంతో లాగడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ రైలు కొంచెం కూడా ముందుకు కదల్లేదు. బైకు పట్టాల మధ్య రాళ్లలో ఇరుక్కుని ముందుకు సరిగా కదలలేకపోయింది. 11 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేసే వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వారి వల్ల రైలులో ఉన్న వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది’..
‘రైల్వే అధికారులు ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి’..‘కొంచెం అయినా బుర్ర, బుద్ధి ఉండాలి.. బైకుతో రైలును లాగటం అంటే అది నిజంగా జోక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లిందా లేదా అన్నది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
పెళ్లికి బంగారం, పట్టుచీర.. రైతులకు రుణమాఫీ.. విజయ్ మ్యానిఫెస్టో ఇదే..
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించండి: మంత్రి లోకేశ్