Man Talks Calmly To Cobra: చలి కాచుకోవడానికి వచ్చిన పాము.. ఆ యువకుడు ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:55 PM
మధ్యప్రదేశ్ ఛత్తార్‌పూర్‌లో ఓ యువకుడు తన దగ్గరకు వచ్చిన నాగు పాముతో ఎలాంటి భయం లేకుండా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చలి మంట దగ్గర ఆగిన పాముతో ‘కాటు వేయకు’ అంటూ సంభాషించిన ఈ ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చిన నాగు పాముతో చిట్ చాట్ చేశాడు. ఆ పాము కరుస్తుందన్న భయం కొంచెం కూడా లేకుండా ఓ నిమిషం పాటు దాంతో మాట్లాడాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తార్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఉదయం పూట చలికి తట్టుకోలేక స్నేహితులతో కలిసి చలి మంట వేశాడు. అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఓ నాగు పాము వచ్చింది. ఆ పామును చూసి యువకుడి స్నేహితులందరూ పరుగులు తీశారు.
కానీ, ఆ యువకుడు మాత్రం అక్కడినుంచి పక్కకు కదల్లేదు. ఆ పాము చలి మంటకు కొద్దిదూరంలో ఆగిపోయింది. ఆ యువకుడు తనకు రెండు అడుగుల దూరంలో ఉన్న పాముతో మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘నువ్వు నన్ను కాటు వేయకు. నీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. రిలాక్స్ అవ్వు. బాగా చలి కాచుకో’ అని ఓ నిమిషం పాటు దాంతో మాట్లాడాడు. ఆ పాము కూడా అతడి మాటలు వింటున్నట్లు అటు, ఇటు ఊగసాగింది. అతడికి ఎలాంటి హానీ చేయలేదు. అతడు కూడా దాన్ని ఏమీ చేయలేదు. కొద్ది సేపటి తర్వాత ఆ పాము అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ యువకుడు చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడు. పామును చూసి పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్’..‘పాము అతడి దోస్త్‌లా ఉంది. ఏం చెప్పినా శ్రద్ధగా వింటోంది’..‘పాములకు కూడా చలిపెడుతుంది. అందుకే అది చలి కాచుకోవటానికి వచ్చింది’..‘నీ ధైర్యం తగలెయ్య.. నీ ప్రాణాలు పోతాయ్ బాబు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
‘అర్జున్ బ్యాటింగ్ సచిన్‌లాగే ఉంటుంది’.. కోచ్‌లపై యోగిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఐదు నెలల బాలుడి ప్రాణం తీసిన 'పాలు'