ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో చెప్పే ట్రిక్! జనాల నుంచి మిశ్రమ స్పందన
ABN , Publish Date - Mar 15 , 2026 | 02:41 PM
సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తడి వస్త్రంతో తెలుసుకోవచ్చని చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విధానం అంత కచ్చితమేమీ కాదని కొందరు విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ అంతా ఎల్‌పీజీ సిలిండర్‌లపైనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోపై జనాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఈ చిట్కాపై కొందరు విమర్శలు గుప్పించారు. అయితే, వీడియోకు మాత్రం వ్యూస్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునేందుకు ముందుగా తడి వస్త్రంతో సిలిండర్ అంతా తుడవాలి. ఆ తరువాత రెండు నిమిషాల పాటు తడిని ఆరనివ్వాలి. ఈ క్రమంలో గ్యాస్‌లేని పైభాగంలో ముందుగా తడి ఎండిపోతుందట. గ్యాస్ ద్రవ రూపంలో ఉన్న సిలిండర్ కింది భాగంలో తడి కాస్త ఎక్కువ సేపు నిలిచి ఉంటుందట. ఇలా తడి ఎంత వరకూ ఉందో చెక్ చేసి ఆ మేరకు గ్యాస్ ఉన్నట్టు భావించాలని వీడియోలో చెప్పుకొచ్చారు.
అయితే, ఈ వీడియోపై మాత్రం జనాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది సాంకేతికంగా కచ్చితమైన విధానం కాదని కొందరు విమర్శించారు. సిలిండర్ బరువును బట్టి గ్యాస్ ఎంత ఉందో కచ్చితంగా అంచనా వేయొచ్చని మరికొందరు సూచించారు. సిలిండర్ కదిపినప్పుడు లోపల ద్రవ రూపంలో ఉన్న ఎల్‌పీజీ కదలికలను బట్టి కూడా ఒక అంచనాకు రావొచ్చని మరికొందరు అన్నారు. మరి జనాల్లో ఆసక్తి రేపుతున్న ఈ వీడియోపై మీరూ ఈ లుక్కేయండి!
ఈ వార్తలో చదవండి:
78 ఏళ్ల వయసులో ఈ పెద్దాయన.. గుండెను మెలిపెట్టే వీడియో
టిక్కెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..