78 ఏళ్ల వయసులో ఈ పెద్దాయన.. గుండెను మెలిపెట్టే వీడియో
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:19 PM
78 ఏళ్ల వృద్ధుడు ఫుడ్ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు చలించిపోయారు. గోఫండ్‌మీ ద్వారా సుమారు 5 లక్షల డాలర్లు విరాళాలుగా అందించారు.
ఇంటర్నెట్ డెస్క్: డబ్భై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఓ వృద్ధుడు ఫుడ్ డెలివరీ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న ఘటన తాలూకు వీడియో వైరల్‌గా మారింది. పెద్దాయన కష్టాన్ని చూసి చలించిపోయిన అనేక మంది ఆయనకు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఇకనైనా ప్రశాంతంగా రిటైర్ అయ్యేందుకు ఆయనకు చేతనైన సాయం చేశారు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, రిచర్డ్ పుల్లీ (78) అనే వృద్ధుడు స్టార్‌బక్స్ ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్‌ను ఒక ఇంటికి డెలివరీ చేశాడు. ఆ సమయంలో ఆయన జాగ్రత్తగా వ్యవహరించిన తీరు ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బ్రిట్టానీ స్మిత్ అనే మహిళ ఈ వీడియోలను నెట్టింట పంచుకోవడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది.
పని విషయంలో పెద్దాయనకు ఉన్న నిబద్ధత తనను ఆశ్చర్యపరిచిందని బ్రిట్టానీ స్మిత్ పేర్కొన్నారు. ఆర్డర్‌ను నిర్లక్ష్యంగా అక్కడ వదిలివెళ్లకుండా జాగ్రత్తగా కిందపెట్టిన తీరు ఆకట్టుకుందని చెప్పారు. ఆ పెద్దాయనకు భార్య ఉందని, కుటుంబం కోసం ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నారని తెలిపారు. ఆ దంపతులు డెలివరీ ఏజెంట్స్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. భార్య తమ వ్యాన్‌ను డ్రైవ్ చేస్తుంటే ఆయన వస్తువులను ఇంటికి చేరుస్తారని అన్నారు. ఆ దంపతులది 56 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం అని చెప్పారు. వైద్య ఖర్చుల కారణంగా ఉద్యోగం చేయక తప్పట్లేదని అన్నారు. వారికి ఆర్థికంగా సాయం చేయాలంటూ గో ఫండ్ మీ పేజ్ ద్వారా జనాలను ఆమె అభ్యర్థించడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఆ వృద్ధ దంపతుల కష్టం చూసి చలించిపోయిన నెటిజన్లు భారీ ఎత్తున విరాళాలు అందించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే 5 లక్షల డాలర్ల మేర వారికి సాయం అందింది. ఇది చూసి ఆ వృద్ధ దంపతులు ఆశ్చర్యపోయారు. తమకు పరిచయం లేని వారు కూడా ఆదుకునేందుకు ముందుకు రావడం తమను కదిలించిందని కామెంట్ చేశారు. ఈ సాయంతో కొంతమేర అయినా తమపై ఒత్తిడి తగ్గుతుందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలో చదవండి:
టిక్కెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..
విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..