టికెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..
ABN , Publish Date - Mar 14 , 2026 | 03:09 PM
టికెట్ ఉన్నప్పటికీ రైల్లో సీటు దొరకక ఇబ్బంది పడుతున్న కొరియన్ వ్యక్తికి ఆర్‌పీఎఫ్ అధికారి సహాయం చేశారు. సీటు ఆక్రమించిన వ్యక్తిని లేవమని చెప్పి ఫారినర్‌ను అక్కడ కూర్చోబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టికెట్ లేకుండా కొందరు రైళ్లు ఎక్కి తోటి ప్రయాణికుల సీట్లు ఆక్రమించిన ఉదంతాలు గతంలో అనేకం వెలుగు చూశాయి. తాజాగా భారత పర్యటనకు వచ్చిన ఒక కొరియన్ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టిక్కెట్టు ఉన్నా రైల్లో సీటు దొరక్క నిలబడి ప్రయాణించాల్సి వచ్చింది. చివరకు రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) అధికారి ఒకరు జోక్యం చేసుకోవడంతో ఆ విదేశీ వ్యక్తి సమస్య నుంచి బయటపడ్డారు. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ముజఫర్‌పూర్ (బిహార్) నుంచి ఢిల్లీ వెళుతున్న రైల్లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైల్లో నిలబడి ప్రయాణిస్తున్న విదేశస్థుడిని చూసిన ఆర్‌పీఎఫ్ అధికారి అసలు ఏం జరిగిందో ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఫారినర్ వద్ద కన్ఫర్మర్డ్ టిక్కెట్ ఉందని గుర్తించారు. ఆ తరువాత ఫారినర్‌కు కేటాయించిన సీటు వద్దకు వెళ్లి చూడగా అక్కడ కొందరు యువకులు కనిపించారు. వారిలో ఒక యువకుడు ఆ ఫారినర్ సీటులో ఏకంగా పడుకుని నిద్రిస్తున్నాడు.
దీంతో, ఆర్‌పీఎఫ్ అధికారి అతడిని అక్కడి నుంచి పంపించి కొరియన్ వ్యక్తిని కూర్చోబెట్టారు. కనీసం విదేశీయుల విషయంలో అయినా కాస్త జాగ్రత్తగా ఉండద్దా? ఆయన మన దేశానికి మొదటిసారి వచ్చి ఉండవచ్చు! మీరేమో ఆయన సీటులో కూర్చున్నారు’ అంటూ ఆర్‌పీఎఫ్ అధికారి అసంతృప్తి వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది. ఈ క్రమంలో సదరు కొరియన్ వ్యక్తి ఆర్‌పీఎఫ్ అధికారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆర్‌పీఎఫ్ అధికారిని ప్రశంసించారు. యువకుల తీరును మరికొందరు విమర్శించారు.
ఈ వార్తలో చదవండి:
విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..
చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్ చూస్తుండగా..