జింక కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టేశాడు.. గడ్డ కట్టిన సరస్సుపై..
ABN , Publish Date - Feb 09 , 2026 | 07:04 AM
అమెరికా, స్టీవెన్స్ కౌంటీలోని లూన్ లేక్‌లో చిక్కుకుపోయిన జింకను కాపాడ్డానికి ఓ ఫైర్ ఫైటర్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో శ్రమించి దాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు..
ఇంటర్‌నెట్ డెస్క్: గడ్డ కట్టిన సరస్సులో చిక్కుకుపోయిన జింకను కాపాడ్డానికి ఓ ఫైర్ ఫైటర్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో శ్రమించి దాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల నుంచి అమెరికాలో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోయాయి. దీంతో నదులు, సరస్సులు గడ్డకట్టిపోతున్నాయి. స్టీవెన్స్ కౌంటీలోని లూన్ లేక్ కూడా మొత్తం గడ్డ కట్టిపోయింది. ఓ జింక గడ్డ కట్టిన సరస్సులో చిక్కుకుపోయింది. ఎటూ వెళ్లలేక ఇబ్బందిపడసాగింది.
ఇది గమనించిన స్థానికులు స్టీవెన్స్ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొన్ని నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జింకను ఎలా బయటకు తీసుకురావాలో ప్లాన్ చేసుకున్నారు. ఓ ఫైర్ ఫైటర్ తాడు తీసుకుని అత్యంత జాగ్రత్తగా మంచు మీద నడుచుకుంటూ జింకను చేరుకుని, దానికి తాడు కట్టాడు. సరస్సు బయట ఉన్న మిగిలిన ఫైర్ ఫైటర్లు తాడును లాగటం మొదలెట్టారు. ఇలా ఎంతో కష్టం మీద జింకను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అయితే, జింకను తీసుకొచ్చే సమయంలో కొంచెం అటు, ఇటు అయినా జింకతో పాటు ఫైర్ ఫైటర్ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవి. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘తనను కాపాడినందుకు జింక ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఆ ఫైర్ ఫైటర్ హీరో’.. ‘పాపం ఇలాంటి వారిని ఎందుకు ప్రభుత్వం సత్కరించదు. నిజమైన హీరోలు ఇలాంటి వారే’..‘గడ్డ కట్టిన సరస్సులోకి వెళ్లటం అంటే ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆఖరి బంతికి ఇంగ్లండ్ బతికిపోయింది