ఇది భారతీయ కంపెనీలకు మేలు కొలుపు కావాలి: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు
ABN , Publish Date - Jun 03 , 2026 | 10:13 PM
భవిష్యత్తుపై గూగుల్ పెట్టుబడి పెడుతున్న తీరు చూసి భారతీయ కంపెనీలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అన్నారు. ఇది భారతీయ కంపెనీలకు మేలుకొలుపు కావాలని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తాజాగా భారతీయ వ్యాపార సంస్థలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దిగ్గజ కార్పొరేట్ సంస్థలు వేల కోట్లను ఆర్జిస్తున్నప్పటికీ సంతృప్తి చెందకుండా భవిష్యత్తుపై పెట్టుబడులు పెడుతున్న వైనాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా గూగుల్ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సంస్థ ఆర్థిక సామర్థ్యం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
‘గూగుల్ వార్షిక లాభం 160 బిలియన్ డాలర్లు. గత త్రైమాసికంలో 62 బిలియన్‌లను ఆర్జించింది. సంస్థ మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్‌లు. భారతీయ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, లాభాల కంటే ఇది ఎక్కువ. ఇది భారతీయ కంపెనీలకు మేలు కొలుపు కావాలి. ప్రస్తుత పరిస్థితి ఎంత మెరుగ్గా ఉన్నప్పటికీ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టాలి’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కృత్రిమ మేధపై పెట్టుబడుల కోసం ఇటీవల గూగుల్ ఏకంగా 80 బిలియన్ డాలర్లను సేకరించేందుకు ప్రణాళిక ఆవిష్కరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ప్రభుత్వాలు నిధుల సేకరణ జరిపే స్థాయిలో ఒక కార్పొరేట్ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహంతో నిధులు సేకరించడంతో పెద్ద చర్చుకు దారి తీసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇక్కడి ఆతిథ్యాన్ని మర్చిపోలేను.. బీహార్‌పై అమెరికన్ యాత్రికుడి ప్రశంసల వర్షం
డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా.. వీడియో వైరల్!