థానేలో బ్రిడ్జి వద్ద కారుపై పడ్డ ఇనుప చువ్వలు.. రూ.2 కోట్ల జరిమానా
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:08 PM
రోజూలాగే సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఒక్కసారిగా ఊహించని ప్రమాదం పలకరించింది. థానేలోని బిజీగా ఉండే కోప్రి వంతెనపై ఆనంద్ నగర్–సాకేత్ ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్ట్ పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా భారీ ఇనుప కడ్డీల బోను కూలి నేరుగా కదులుతున్న కారుపై పడింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: థానేలోని బిజీగా ఉండే కోప్రి వంతెన సమీపంలో తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆనంద్ నగర్–సాకేత్ ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రదేశంలో.. ఒక భారీ నిర్మాణ పటిష్టపరిచే ఇనుప చువ్వలు (రీఇన్ఫోర్స్మెంట్ కేజ్) ఊహించని విధంగా కూలిపోయి నేరుగా రహదారిపై కదులుతున్న ఒక కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు విండ్షీల్డ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ప్రమాదం జరిగిన తీరు వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. అదృష్టవశాత్తు, కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాపాయం తప్పిందని అధికారులు ధృవీకరించారు.
MMRDA సత్వర చర్యలు.. రూ. 2 కోట్ల జరిమానా..
ఈ ఘటనపై ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA) తీవ్రంగా స్పందించింది. నిర్మాణ ప్రదేశాలలో భద్రతా ప్రమాణాల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రాజెక్టు అమలుకు బాధ్యత వహించిన కాంట్రాక్టర్పై ఏకంగా రూ.2 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ దెబ్బతిన్న కారును పక్కకు తీసివేశారు. అనంతరం క్రేన్ సహాయంతో రోడ్డుపై పడిన భారీ ఇనుప నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించాయి. ఈ నిర్మాణాత్మక వైఫల్యానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి.. వ్యవస్థాగత లోపాలను గుర్తించడానికి MMRDA క్షుణ్ణమైన దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక