మా నాన్న 7వ సారి పెళ్లి చేసుకుంటున్నారు.. పోలీసులకు టీనేజర్ ఫిర్యాదు
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:45 PM
తండ్రి ఏడోసారి పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ ఓ టీనేజ్ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లిళ్ల కారణంగా తమ కుటుంబ ఆస్తులు కరిగిపోతున్నాయని, ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా వింత ఘటన వెలుగు చూసింది. ఏడవ సారి పెళ్లి చేసుకుంటున్న తన తండ్రిని అడ్డుకోవాలంటూ ఓ టీనేజ్ కుర్రాడు పోలీసులను ఆశ్రయించాడు. ఆజంగఢ్ జిల్లాలోని అహ్రౌలాలో ఈ ఘటన వెలుగు చూసింది. మళ్లీ పెళ్లి వద్దని తన తండ్రికి చెబుతున్నా వినలేదని టీనేజర్ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ టీనేజర్ తన తండ్రిపై (55) పలు ఆరోపణలు గుప్పించాడు. ఇప్పటికే తన తండ్రికి ఆరు సార్లు పెళ్లి అయ్యిందని అన్నాడు. తను మూడో భార్య కొడుకునని చెప్పాడు. ఈ ఏడాదే తన తండ్రి ఆరవ సారి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అయితే, తను ఆశించిన మేర భూమి, నగలు దక్కకపోవడంతో ఆరవ భార్య వెళ్లిపోయిందని చెప్పాడు. ఇంత జరిగినా కూడా మళ్లీ తన తండ్రి మరో పెళ్లికి సిద్ధమయ్యారని వాపోయాడు.
ఈ పెళ్లిళ్ల కారణంగా తమ కుటుంబం ఆర్థిక స్థితిగతులు కూడా దిగజారాయని ఆరోపించాడు. ఈ వయసులో తమ తండ్రికి మానసిక సమతౌల్యం తప్పుతున్నట్టు అనుమానంగా ఉందని కూడా ఆ టీనేజర్ అన్నాడు. ఇక తాజాగా పెళ్లి కోసమని తండ్రి తమ వారసత్వ ఆస్తులను మళ్లీ అమ్మేందుకు సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు రూ.50 వేల అడ్వాన్స్‌ను కూడా తీసుకున్నారని అన్నాడు. గతంలో తమకున్న భూమిలో సగాన్ని కుదవ పెట్టాడని, ఆ అప్పు తీర్చాల్సిన భారం తనపై పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం ఆస్తులు, పెళ్లిళ్ల రికార్డులను సేకరిస్తున్నారు.
ఈ వార్తలూ రాయండి:
ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..
సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?