Share News

ప్రియురాలితో పెళ్లి కోసం ప్రాణాలకు తెగించిన బాలుడు

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:50 AM

ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ప్రియురాలితో పెళ్లి కోసం 15 ఏళ్ల ఓ బాలుడు తన ప్రాణాలకు తెగించాడు. ఏకంగా హై ఓల్టేజ్ కరెంట్ లైన్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియురాలితో పెళ్లి కోసం ప్రాణాలకు తెగించిన బాలుడు
Prayagraj news

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రియురాలితో పెళ్లి కోసం 15 ఏళ్ల ఓ బాలుడు తన ప్రాణాలకు తెగించాడు. ఏకంగా హై ఓల్టేజ్ కరెంట్ లైన్ ఎక్కేశాడు. 13 ఏళ్ల తన ప్రియురాలితో పెళ్లి చేస్తామని హామీ ఇచ్చే వరకు అందరికీ చుక్కలు చూపించాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్న తర్వాతే కిందకు దిగాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లోని భౌవ్‌పూర్‌ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు పొరుగు గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు.


ఇద్దరూ చిన్న వాళ్లు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడు గురువారం నాడు గ్రామంలోని 11,000 ఓల్ట్స్ కరెంట్ లైన్‌పైకి ఎక్కాడు. కరెంట్ లైన్‌పై అతడిని చూసిన జనం పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. కిందకు దిగమని వేడుకున్నారు. ప్రియురాలితో పెళ్లికి అంగీకరిస్తే గానీ కిందకు దిగనని బాలుడు తేల్చి చెప్పేశాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఎంత నచ్చజెప్పటానికి ప్రయత్నించినా వినలేదు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు ఆ లైన్‌కు సప్లై ఆపేశారు. కొద్దిసేపటి తర్వాత అస్పుర్ దేవ్‌సారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


బాలుడికి నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేశారు. బాలుడు వారి మాటలు కూడా వినలేదు. ఈ సారి కరెంట్ తీగ పట్టుకుని వేలాడ్డం మొదలెట్టాడు. దీంతో అక్కడి వారంతా భయపడిపోయారు. ప్రియురాలితో అతడి పెళ్లి చేయడానికి పెద్దలు ఒప్పుకున్నారు. సంతోషించిన బాలుడు కిందకు దిగడానికి అంగీకరించాడు. నిచ్చెన సాయంతో అధికారులు అతడిని కిందకు తీసుకువచ్చారు. పోలీసులు 3 గంటల పాటు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

అసత్యాలతో బీఆర్‌ఎస్‌ కారుకూతలు

పొలిమేర కూడా దాటనియ్య

Updated Date - Feb 08 , 2026 | 08:25 AM