Share News

అసత్యాలతో బీఆర్‌ఎస్‌ కారుకూతలు

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:22 AM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేకపోతున్నారని, అసత్య ప్రచారాలతో కారుకూతలు కూస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

అసత్యాలతో బీఆర్‌ఎస్‌ కారుకూతలు

  • మునిసిపోల్‌లోనూ కాంగ్రె్‌సదే గెలుపు: తుమ్మల

హుస్నాబాద్‌ రూరల్‌/నంగునూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేకపోతున్నారని, అసత్య ప్రచారాలతో కారుకూతలు కూస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వాదించారన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్తోనూ వంద శాతం కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీసీ కులగణన జరిగిందని, మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపట్టబోతుందని చెప్పారు. ఎస్సీల జీవిత కాల కోరిక అయిన వర్గీకరణ చేసి చూపించామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో భాగంగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణేనని ఆయన చెప్పారు. కాగా, సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - Feb 08 , 2026 | 07:23 AM