నాకు ఆఫీసులో పనే ఉండదు.. టెకీ పోస్టు వైరల్
ABN , Publish Date - Apr 05 , 2026 | 08:40 PM
తనకు ఆఫీసులో పనే ఉండదంటూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను ఐఐటీలొ చదువుకున్నానని, కానీ ఆఫీసులో సంతృప్తిని ఇచ్చే పని లేదని సదరు టెకీ రాసుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎమ్‌ఎన్‌సీలో పనిచేస్తున్న ఒక టెకీ తనకు ఆఫీసులో పనే ఉండదంటూ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఐఐటీలో చదువుకున్న తనకు ఆఫీసులో సంతృప్తిని ఇచ్చే పనే లేదని కామెంట్ చేశారు. రెడిట్‌లో ఈ పోస్టును షేర్ చేశారు. మంచి శాలరీ తీసుకుంటున్నా అందుకు తగిన పని ఉండట్లేదని అన్నారు. కెరీర్ స్తంభించిపోయినట్టు ఉందని అన్నారు.
‘నాకు ఆఫీసులో ముఖ్యమైన పని ఏదీ లేదు. నేను రోజూ ఆఫీసుకు వెళతాను. డెస్క్ వద్ద కూర్చుంటాను. ఈమెయిల్స్, మెసేజీలను చెక్ చేసుకుంటాను. ఆ తరువాత రీల్స్, యూట్యూబ్ లెక్చర్స్‌ను చూస్తూ టైమ్ పాస్ చేస్తాను. చివరకు సాయంత్రం ఇంటికి వెళ్లిపోతాను. తెగ బోర్ కొడుతోంది’ అని రాసుకొచ్చారు.
తనకు ఆసక్తిని కలిగించే పని లేకపోవడంతో పాటు తన టీమ్‌లో కూడా నిరుత్సాహకర వాతావరణం ఉంటుందని చెప్పారు. సీనియర్ ఉద్యోగులు జూనియర్లకు మార్గదర్శనం చేసేందుకు, వారితో కలిసి పని చేసేందుకు ఉత్సాహం చూపరని అన్నారు. దీంతో, ఆఫీసులో ఒంటరిగా ఉన్నానన్న భావన కలుగుతోందని చెప్పారు.
ప్రస్తుత కంపెనీని వదిలేసి ఏదైనా స్టార్టప్ సంస్థలో చేరడమో లేక కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమో చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు చెప్పారు. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో పరిస్థితుల దృష్ట్యా వెనక్కు తగ్గినట్టు తెలిపారు. కృత్రిమేధ కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల తీరుతెన్నులు కూడా మారిపోయాయని అన్నారు. ఒకప్పుడు జూనియర్ డెవలపర్స్ చేసే పనులన్నీ ఇప్పుడు ఏఐ చేస్తోందని, ఫలితంగా, యువ ఉద్యోగులకు పనిలో రావాల్సిన నైపుణ్యం లేకుండా పోతోందని చెప్పారు. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎక్కువ కాలం పరిస్థితి ఇలాగే ఉంటే కెరీర్ కుంటుపడుతుందని పలువురు హెచ్చరించారు.
ఈ వార్తలూ చదవండి:
దురంధర్-2.. దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్‌ల గ్యాంగ్ వార్ చరిత్ర ఇదీ
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..