Share News

అదనపు ఆదాయం కోసం ఆటో కొనుక్కున్న టెకీ.. చివరకు..

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:06 PM

కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ అదనపు ఆదాయం కోసం ఆటో కొనుగోలు చేశాడు. దాన్ని అద్దెకు ఇచ్చి రోజుకు రూ.600 సంపాదిద్దామని భావించాడు. కానీ తొలి రోజునే అతడి ప్లాన్ ఊహించని విధంగా వికటించింది.

అదనపు ఆదాయం కోసం ఆటో కొనుక్కున్న టెకీ.. చివరకు..
Techie's auto stolen

ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ సంస్థలో దశాబ్దానికిపైగా ఉద్యోగం చేస్తున్న ఓ టెకీ అదనపు ఆదాయం కోసం ఆటో కొనుగోలు చేశాడు. దాన్ని అద్దెకు ఇచ్చి రోజుకు రూ.600 సంపాదిద్దామని భావించాడు. కానీ తొలి రోజునే అతడి ప్లాన్ తలకిందులైంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నించిన ఆ టెకీకి ఎలాంటి షాక్ తగిలిందో చెబుతూ అతడి సహోద్యోగి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. గౌరవ్ తొమర్ అనే నెటిజన్ ఈ పోస్టును ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

అదనపు ఆదాయం కోసం తన సహోద్యోగి చేసిన ప్రయత్నం మొదటి రోజునే బెడిసికొట్టిందని గౌతమ్ తొమర్ చెప్పారు. ఆ టెకీ తమ ఆఫీసులోని ప్యూన్ సలహా మేరకు రూ.1.75 లక్షలు పెట్టి ఆటో కొనుగోలు చేశాడని అన్నారు. ప్యూన్ సూచించిన డ్రైవర్‌కే వాహనాన్ని అద్దెకు ఇచ్చాడని కూడా చెప్పారు. సొంత ఆటో ఉంటే అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడంతో పాటు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చని ఆ ప్యూన్ తన టెకీ ఫ్రెండ్‌కు సలహా ఇచ్చాడని అన్నారు.


కానీ ఆ ఆటో డ్రైవర్ తొలి రోజునే ఆటోతో సహా ఉడాయించడంతో తన సహోద్యోగి ఇబ్బందుల్లో కూరుకుపోయాడని తొమర్ చెప్పారు. ఇది జరిగి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ ఆ ఆటోడ్రైవర్ జాడ కనిపించరలేదని చెప్పారు. 12 ఏళ్లుగా కార్పొరేట్ సంస్థలో చేస్తున్న ఓ వ్యక్తి ఇంతటి మూర్ఖపు పని ఎలా చేసాడో అని తొమర్ విస్తుపోయారు.

ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆటో పోగొట్టుకున్న వ్యక్తికి అనేక మంది మద్దతుగా నిలిచారు. అతడి ప్లాన్‌లో తప్పు లేకపోయినా అమలులో ఎదురుతన్నిందని అన్నారు. ఆటో డ్రైవర్ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటి వివరాలను టెకీ తీసుకోలేదేమోనని సందేహం వ్యక్తం చేశారు. కారు అద్దెకు ఇచ్చినా ఇలాగే జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇలా బతకడం నా వల్ల కాదు.. ప్రభుత్వ బ్యాంకు జాబ్‌కు మహిళ రాజీనామా

స్కూల్‌ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

Updated Date - Oct 02 , 2026 | 03:15 PM