ఈ పోలీస్ సాహసానికి సెల్యూట్.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:46 PM
ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని కాపాడటం కోసం ఓ పోలీస్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో రిస్క్ తీసుకుని ఏడవ అంతస్తులో ఉన్న యువకుడి ఫ్లాట్‌లోకి వెళ్లాడు. ఆత్మహత్య చేసుకోకుండా అతడిని అడ్డుకున్నాడు.
సూరత్, జూన్ 12: ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని కాపాడటం కోసం ఓ పోలీస్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో రిస్క్ తీసుకుని ఏడవ అంతస్తులో ఉన్న యువకుడి ఫ్లాట్‌లోకి వెళ్లాడు. ఆత్మహత్య చేసుకోకుండా అతడిని అడ్డుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. జూన్ 8వ తేదీన సూరత్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ యువకుడు తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు యత్నిస్తున్నాడన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ కానిస్టేబుల్ శైలేశ్ చూదాసమా, డ్రైవర్ క్రిపల్‌సిన్హ్ గోహిల్ సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న యువకుడి ఫ్లాట్ బిల్డింగ్‌లోని ఏడవ అంతస్తులో ఉంది. శైలేశ్, డ్రైవర్ ఆ ఫ్లాట్ దగ్గరకు వెళ్లారు. ఫ్లాట్ తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉంది. దీంతో కానిస్టేబుల్ శైలేశ్ ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి.. పక్క ఫ్లాట్ బాల్కనీలోని సేఫ్టీ గ్రిల్ మీదుగా యువకుడి ఫ్లాట్‌లోకి వెళ్లాడు. పురుగుల మందు తాగుతున్న యువకుడిని ఆపాడు. ఆ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాడు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పోలీస్ కానిస్టేబుల్ శైలేశ్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ‘పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు’..‘పోలీస్ కానిస్టేబుల్ శైలేశ్‌కు సెల్యూట్. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి కూడా శైలేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇవి కూడా చదవండి
గ్రామసభ బలపడితేనే దేశం బలపడుతుంది: పవన్ కల్యాణ్
నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?