Share News

ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత ఘటన.. లక్ష రూపాయల సంచితో పరారైన వీధి కుక్క!

ABN , Publish Date - May 24 , 2026 | 05:07 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో‌ని బిజ్నోర్ జిల్లాలో విచిత్రమైన, నమ్మశక్యం కాని ఘటన ఒకటి వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత ఘటన.. లక్ష రూపాయల సంచితో పరారైన వీధి కుక్క!
Uttar Pradesh Viral News

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో‌ని బిజ్నోర్ జిల్లాలో విచిత్రమైన, నమ్మశక్యంకాని ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు చెందిన లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని ఆ శునకం నోట కరచుకుని పారిపోయింది. సాధారణంగా దొంగలు డబ్బులు కొట్టేయడం చూస్తుంటాం. కానీ, ఇలా ఓ కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం ఆ కుక్క, దాని నోట ఉన్న డబ్బుల సంచి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదును విత్‌డ్రా చేసుకున్నాడు. ఆ డబ్బును భద్రంగా ఒక సంచిలో పెట్టుకుని తన బైక్‌పై బయల్దేరాడు. నమాజ్‌కు సమయం కావడంతో, మార్గమధ్యంలో ఓ మసీదు వద్ద బైక్‌ను ఆపాడు. డబ్బుల సంచిని బైక్‌కే తగిలించి, మసీదు లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే తిరుగుతున్న ఓ వీధి శునకం కన్ను ఆ సంచిపై పడింది. అందులో ఏదైనా తినే పదార్థం ఉందేమోనని భ్రమపడి.. క్షణాల వ్యవధిలో దానిని నోట కరచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన వ్యాపారవేత్తకు బైక్‌పై సంచి కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎవరో దొంగలు తన డబ్బును కాజేశారని కంగారుపడుతూ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మసీదు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆ విజువల్స్ చూసిన పోలీసులతో పాటు వ్యాపారవేత్త కూడా నోరెళ్లబెట్టారు. అక్కడ దొంగతనం చేసింది మనుషులు కాదని, ఓ వీధి కుక్క అని సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం ఈ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్..

కాంగ్రెస్ వాళ్లని దరిదాపుల్లోకి రానివ్వొద్దు.. విజయ్‌కు మద్దతివ్వడంపై ఉదయనిధి ఆగ్రహం..

Updated Date - May 24 , 2026 | 06:21 PM