Share News

విశ్వాసం అంటే ఇది.. నాలుగు రోజులుగా మహిళ సమాధి దగ్గర వీధి కుక్క..

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:56 AM

కేరళలో ఓ వీధి కుక్క తనకు తిండి పెట్టిన మహిళ ప్రాణాలు కాపాడ్డానికి ఎంతగానో ప్రయత్నించింది. ఆమె చనిపోయినా కూడా దానికి ఆమె మీద ప్రేమ తగ్గలేదు.

విశ్వాసం అంటే ఇది.. నాలుగు రోజులుగా మహిళ సమాధి దగ్గర వీధి కుక్క..
stray dog loyalty

తిరువనంతపురం, ఏప్రిల్ 29: కుక్క విశ్వాసానికి మారుపేరన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నా అనుకున్న వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కుక్కలు ఏమాత్రం వెనుకాడవు. యజమానులు బతికున్నపుడు మాత్రమే కాదు.. చనిపోయిన తర్వాత కూడా వారిపై విశ్వాసం తగ్గదు. ఇందుకు కేరళలో జరిగిన తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కేరళలో ఓ వీధి కుక్క తనకు తిండి పెట్టిన మహిళ ప్రాణాలు కాపాడ్డానికి ఎంతగానో ప్రయత్నించింది. ఆమె చనిపోయినా కూడా దానికి ఆమె మీద ప్రేమ తగ్గలేదు.


గత నాలుగు రోజుల నుంచి సమాధి దగ్గరే ఉంటోంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మలప్పురం జిల్లాలోని పాతప్పిరియం పెరువిల్కుండు వలియపీడియక్కల్‌కు చెందిన అమీనా అనే మహిళ తను నివసించే ప్రాంతంలో ఉండే ఓ వీధి కుక్కకు తరచుగా తిండిపెట్టేది. కొద్దిరోజులకే ఇద్దరి మధ్యా అనుబంధం ఏర్పడింది. ప్రతీ రోజు ఆ కుక్క ఆమె రాకకోసం ఎదురుచూసేది. కొన్ని రోజుల క్రితం అమీనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుక్క గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విన్న జనం అక్కడికి వచ్చారు.


రోడ్డుపై పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అమీనా చనిపోయినా కుక్కకు ఆమె మీద ప్రేమ తగ్గలేదు. అమీనాను సమాధి చేసి నాలుగు రోజులు అయింది. అప్పటి నుంచి ఆ కుక్క సమాధి దగ్గరే ఉంటోంది. కుటుంబసభ్యులు సమాధి దగ్గరకు వచ్చినపుడు దూరంగా వెళ్లి నిల్చుంటుంది. వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత సమాధి దగ్గరకు వస్తుంది. ప్రస్తుతం వీధి కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మనుషులకు నమ్మిన బంట్లు కుక్కలు మాత్రమే. అవి మనుషులను మోసం చేయవు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పిన బాబర్

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

Updated Date - Apr 29 , 2026 | 09:36 AM