Share News

లగేజీ బరువు ఒక గ్రాము ఎక్కువ! రూ.2 వేల అదనపు చార్జీ.. ఎయిర్‌లైన్స్‌పై ప్యాసెంజర్ గుస్సా

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:07 PM

కేబిన్ లగేజీ బరువు పరిమితికి మించి గ్రాము అదనంగా ఉన్నా రూ.2 వేల వరకూ ఎయిర్‌లైన్స్ సంస్థలు వసూలు చేస్తున్నాయంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

లగేజీ బరువు ఒక గ్రాము ఎక్కువ! రూ.2 వేల అదనపు చార్జీ.. ఎయిర్‌లైన్స్‌పై ప్యాసెంజర్ గుస్సా
SpiceJet viral video

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌లైన్స్ సంస్థలపై ప్రయాణికులు చేస్తున్న ఫిర్యాదులు నిత్యం నెట్టింట చర్చకు దారి తీస్తుంటాయి. టికెట్ ధరలు, అకస్మాత్తుగా మారిపోయే ప్రయాణ సమయాలు, అదనపు బ్యాగేజీ కోసం చెల్లించాల్సిన అధిక ధరలు.. ఇలా తరచూ ఎన్నో అంశాలపై ప్రయాణికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లగేజీ బరువు ఒక గ్రాము అదనంగా ఉన్నందుకు రూ.2 వేలు చెల్లించాలా? అంటూ స్పైస్‌‌జెట్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ప్యాసెంజర్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు స్పైస్ జెట్ సిబ్బందితో లగేజీ బరువు విషయంలో వాగ్వాదం చేస్తూ కనిపించారు. కొంచెం బరువు ఎక్కువగా ఉన్నందుకు అంత ఎక్కువ ఎందుకు డబ్బు చెల్లించాలని వాదనకు దిగారు. అదనపు లగేజీకి త్వరగా బిల్లు చెల్లించాలని ప్రయాణికులను సిబ్బంది తొందరపెట్టారు. మరోవైపు, లగేజీ ఓనర్ మాత్రం ఈ విషయమై ఎవరితోనూ ఫోనులో మాట్లాడుతూ కనిపించారు.

ఈ వీడియోను షేర్ చేస్తూ సదరు ప్యాసెంజర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఎయిర్‌పోర్టుకు వెళితే ఎగిరేది మీరు కాదు.. మీ జేబులోని డబ్బులు’ అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. ‘బోర్డింగ్ గేటు వద్దకు వచ్చీ రాగానే లగేజీ బరువును చెక్ చేస్తారు. 7 కేజీలకు మించి ఒక్క గ్రాము ఎక్కువగా ఉన్నా రూ.1000 నుంచి రూ.2000 వేల వరకూ తీసుకుంటారు. విమానం మిస్సవుతామనే కంగారులో అనేక మంది మారుమాట్లాడకుండా ఇచ్చేస్తారు. ఇది ఎయిర్‌లైన్స్ సంస్థలు పక్కా ప్లాన్ ప్రకారం పట్టపగలు చేస్తున్న దోపిడీ’ అని పోస్టు పెట్టారు.


ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘ఇది ఎప్పుడూ ఉండేదే, ప్రయాణికులు కాసేపు అరిచి మళ్లీ సైలెంట్ అయిపోతారని ఎయిర్‌లైన్స్‌కు తెలుసు’ అని మరో వ్యక్తి అన్నారు. మరో ఎయిర్‌లైన్స్‌ను ఎంచుకోవాలని కొందరు సూచించారు.


ఇవీ చదవండి:

యూట్యూబ్ ఛానల్‌ కోసం ఆస్తులమ్మి.. వ్యూస్ రాలేదనే కోపంలో..

రౌడీ షీటర్‌తో మహిళా కానిస్టేబుల్ జంప్! ఆగిపోయిన పెళ్లి

Updated Date - Feb 13 , 2026 | 05:59 PM